కరోనా తర్వాత వైరస్ పేరు చెపితేనే జనానికి వణుకు పుడుతోంది.. ఇక తాజాగా HMPVపై వైరస్ భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో కర్ణాటకలో రెండు కేసులు, గుజరాత్లోని అహ్మదాబాద్లో 1, కోల్కతాలో 1, చెన్నైలో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వైరస్ కేసులు నమోదవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు.
మైక్రో బయాలజిస్ట్లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని నిర్ధేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001 నుంచి ఈ వైరస్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో ఎలాంటి HMPV కేసులు నమోదు కాలేదని తెలిపారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. పండుగ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరస్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఏపీలో మందుల లభ్యతపైనా చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్ 95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరా పెంచాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైపులైన్లకు సంబంధించి అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వినియోగించాలని సూచించారు.
HMPV వైరస్ ముఖ్యంగా చిన్నారులకు సోకుతున్నట్లు తెలుస్తోంది. వీరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, హ్యుమన్ మెటానిమోవైరస్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం స్పష్టం చేసింది. HMPV.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో 12 శాతం వరకూ ఇదే కారణమవుతోందని అంచనా. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 11 ఏళ్ల చిన్నారుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుండగా.. తొలిసారిగా దీన్ని 2001లో నెదర్లాండ్స్లో 28 మంది చిన్నారుల్లో గుర్తించారు.