ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao)కి కూటమి ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు ఆయనతో ప్రత్యేకంగా పుస్తకాలను తయారు చేయించనుంది. అనంతరం వాటిని విద్యార్థులకు పంపీణీ చేయనుంది. ఈమేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చాగంటికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా విద్యార్థుల్లో నైతిక విలువల సలహాదారుగా చాగంటిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. కేబినెట్ హోదా కలిగిన ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని చెప్పారు.