ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ పైన కసరత్తు పూర్తయింది. ముందు సంక్రాంతికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల ని భావించారు. కానీ, రెవిన్యూ సదస్సుల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతికత వినియోగించి జారీ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దరఖాస్తుల స్వీకరణ.. జారీ పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చారు.
కొత్తగా పెళ్లైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అదే సమయంలో కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పించేందుకు ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త డిజైన్ తో కొత్త కార్డులను వినియోగం లోకి తీసుకు రానుంది. కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్ తో జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
క్యూఆర్ కోడ్ తో జారీ ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల తొలి వారం నుంచి కార్డులు జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన వారి నుంచి 70 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు, చేర్పులతో కూడా కలిపి 2 లక్షల రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.