Grama Ward Sachivalayam Employees: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ/వార్డ్ సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రవేశపెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తీసివేసింది. ఇక సచివాలయాల వ్యవస్థలో కూడా అనేక మార్పులు చేసింది. ఉద్యోగుల బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు వచ్చి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయా ప్రభుత్వ శాఖల కింద వారిని అటాచ్ చేసింది.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 2025, మే 31 నాటికి ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్దేశించింది. 5 ఏళ్ల కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఇక ఉద్యోగికి స్వస్థలంలో కానీ సొంత మండలంలో కానీ పోస్టింగ్ ఇవ్వకూడని ఆదేశాలు జారీ చేసింది. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే చోట పోస్టింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కూడా ఒకే చోట పోస్టింగ్ కు ప్రాధాన్యత ఇవ్వనుంది.
ముందుగా ఐటీడీఏ, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ అయిన వారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తరువాతే రిలీవ్ చేయాలనే నిబంధన పెట్టింది. ఒకవేళ బదిలీ అయిన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను హెచ్చరించింది. ఖాళీల వివరాలు హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. బదిలీ యూనిట్ పాత జిల్లాల ఆధారంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తి చేయాలని ఆదేశించింది.
Grama Ward Sachivalayam: సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


