ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ పదవీ కాలం నవంబర్ 30తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో డిసెంబరు 1వ తేదీ బాధ్యతలు చేపట్టే కొత్త సీఎస్ ఎవరు? అనే విషయంలో, ఇటు రాజకీయ వర్గాల్లో, అటు అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి, కొన్ని పేర్లు వినిపించినా ముందునుంచి సీనియర్ ఐఎఎస్ జవహర్‌రెడ్డి రేస్ లో ముందున్నారు. ఆయన నియామకం ఇంచుమించుగా ఖరారు అయిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, హఠాత్తుగా మరో పేరు తెర మీదకు వచ్చింది.
అయితే ముందు నుంచి జవహర్ రెడ్డి వైపే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి ఆఖరి క్షణంలో పునరాలోచన చేయడమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి మనసు మార్చుకోవడం వెనక జవహర్ ‘రెడ్డి’ పేరే కారణమా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ‘రెడ్డి’ వాసన తగ్గించేందుకే జవహర్ రెడ్డి నియామకం విషయంలో పునరాలోచన చేస్తుండవచ్చని విశ్లేషిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత మేరకు రెడ్డి ట్యాగ్ ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు పార్టీ పదవుల్లో కొంచెం ఎత్తు పీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
ఏపీ సీఎస్ రేసులోకి కొత్తగా వచ్చిన కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమణే 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసినట్లు చెబుతున్నారు. మరోవంక, గిరిధర్ అరమణే శనివారం(నవంబర్26) తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో భేటీ అయ్యారు. కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జగన్ రెడ్డి పునరాలోచన వెనుక కేంద్రం ఉందని కూడా అంటున్నారు. ఇంత కాలం జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ వచ్చిన కేంద్రం.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో జగన్ కు ముకు తాడు వేయాలన్న ఉద్దేశంతోనే గిరిధర్ అరమణేను రాష్ట్రానికి పంపుతోందా అనే కోణంలోనూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.