AP Gram Secretariat Name Change: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్తగా పేర్లు మార్చే ప్రహసనం మొదలెట్టింది. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా మారిన గ్రామ సచివాలయాలకు కొత్తగా విజన్ యూనిట్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం పేరు పెట్టింది. సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సింది పోయి..పేర్లు మార్చడం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. పేర్లు మార్చితే క్రెడిట్ వచ్చేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరును మార్చింది. వీటికి కొత్తగా విజన్ యూనిట్స్ అని పేరు పెట్టింది. ఈ నిర్ణయంపై ఇప్పుడు పలు విమర్శలు విన్పిస్తున్నాయి. పేరు మార్చాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో దేశంలోనే తొలిసారిగా గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ ఈ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2019 అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాలకు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,004 సచివాలయాల్ని ఏర్పాటు చేయడమే కాకుండా 1.30 లక్షలమంది శాశ్వత ఉద్యోగుల్ని నియమించారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, ఇంటి గుమ్మం వద్దే కావల్సిన సర్టిఫికేట్లు పొందేందుకు, సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడింది. ఈ వ్యవస్థకు అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ ఉండటంతో ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన అందేది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అద్భుతంగా పనిచేస్తూ వస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థ పేరు మార్చుతూ విజన్ యూనిట్స్ అని పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాలనా వికేంద్రీకరణ సాధ్యమైంది. బాపూజి కలలు కన్న గ్రామ సురాజ్యం కన్పించింది.
పేరు మార్చితే క్రెడిట్ వచ్చేస్తుందా
రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల పేరు ప్రస్తావించగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ జగన్ మాత్రమే. అందుకే జగన్‌కు క్రెడిట్ దక్కకుండా చేసేందుకే విజన్ యూనిట్స్‌గా పేరు మార్చారనే విమర్శ వస్తోంది. అయితే గతంలో వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పధకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా, జగన్ ప్రారంభించిన అమ్మఒడిని తల్లికి వందనంగా చెప్పుకున్నా ఇప్పటికే పాత పేర్లే ప్రజలు నోట ఉంటాయి. పేరు మార్చినంత మాత్రాన క్రెడిట్ రాదంటున్నారు విమర్శకులు. కిలో 2 రూపాయల బియ్యం పధకం పేరు చెబితే ఇప్పటికీ అందరికీ ఎన్టీ రామారావే గుర్తొస్తారు. అలాగే పేరు మార్చినంత మాత్రాన సచివాలయం పేరు చెబితే జగన్ గుర్తు రాకమానరని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రారంభించిన మండలాల వ్యవస్థ
గతంలో అంటే 1985 మే 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తాలూకా వ్యవస్థను రద్దు చేసి కొత్తగా మండల వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ఈ నిర్ణయం ప్రజలకు చాలా చేరువైంది. పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 305 తాలూకాలను 1104 మండలాలుగా విభజించారు. ఈ నిర్ణయంతో ప్రజలకు చాలా ఉపయోగం జరిగింది. అందుకే ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఇదే పేరుతో ఆ వ్యవస్థను కొనసాగించారే తప్ప పేరు మార్చే పనులు చేయలేదు.
కిలో బియ్యం రెండు రూపాయలకు అందించిన ఎన్టీ రామారావు పేరునే ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారు. వైఎస్సార్ హయాంలో అదే కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూపాయికి అందించినా ఇప్పటికే ఆ పధకం పేరు చెబితే ఎన్టీఆర్ మాత్రమే గుర్తొస్తారు. అలాగే ఆరోగ్య శ్రీని పధకాన్ని వైఎస్ఆర్ తరువాత అందరూ కొనసాగించినా ఇప్పటికే వైఎస్ మాత్రమే గుర్తొస్తారు. ఇప్పుడు కూడా సచివాలయాల పేరును విజన్ యూనిట్స్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చినా గుర్తొచ్చేది జగన్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.


