AP common entrance tests conveners : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల సందడి మొదలైంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, లా వంటి కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్లు)కు ఉన్నత విద్యామండలి సారథులను నియమించింది. ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల పర్వానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను, రాష్ట్రంలోని వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి (APSCHE) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన సీనియర్ ఆచార్యులను కన్వీనర్లుగా నియమిస్తూ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య బి. తిరుపతిరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నియమితులైన కన్వీనర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ఏపీ ఈఏపీసెట్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈ కీలక పరీక్షకు, జేఎన్‌టీయూ-కాకినాడకు చెందిన ప్రొ. మోహన్ రావును కన్వీనర్‌గా నియమించారు.
ఏపీ ఈసెట్: ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థుల కోసం నిర్వహించే ఈసెట్‌కు, జేఎన్‌టీయూ-అనంతపురానికి చెందిన ప్రొ. బి. దుర్గాప్రసాద్ సారథ్యం వహించనున్నారు.
ఏపీ ఐసెట్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం నిర్వహించే ఐసెట్‌కు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. ఎం. శశిని కన్వీనర్‌గా నియమించారు.
ఏపీ పీజీఈసెట్: ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష బాధ్యతలను ఆంధ్ర విశ్వవిద్యాలయానికే చెందిన ప్రొ. మల్లికార్జున రావుకు అప్పగించారు.
ఏపీ లాసెట్: న్యాయ విద్య (ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌కు, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి (SPMVV) చెందిన ప్రొ. సీతా కుమారిని కన్వీనర్‌గా నియమించారు.
ఏపీ ఎడ్‌సెట్: బీ.ఎడ్ కోర్సుల ప్రవేశ పరీక్ష బాధ్యతలను, ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షించనున్నారు.
ఏపీ పీజీసెట్: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం వంటి పీజీ కోర్సుల కోసం నిర్వహించే ఈ పరీక్షకు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. వి. పద్మావతిని కన్వీనర్‌గా ఎంపిక చేశారు.
ఏపీ పీఈసెట్: శారీరక విద్య (బీపీఈడీ, ఎంపీఈడీ) కోర్సుల ప్రవేశ పరీక్షకు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. పాల్ కుమార్‌ను నియమించారు.
పరీక్షల షెడ్యూల్.. తేదీలు ఇవే
ఏపీ ఈసెట్: ఏప్రిల్ 23
ఏపీ ఐసెట్: ఏప్రిల్ 28
ఏపీ పీజీఈసెట్: ఏప్రిల్ 29, 30, మే 2
ఏపీ లాసెట్, ఎడ్‌సెట్: మే 4
ఏపీ పీజీసెట్: మే 5, 8, 9, 10, 11
ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్): మే 12 నుంచి 15, 18
ఏపీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్, ఫార్మా): మే 19, 20
విద్యార్థులు ఈ తేదీలను గమనించుకుని, తమకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఉన్నత విద్యామండలి అధికారులు సూచిస్తున్నారు.

