Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: హోం మంత్రి అనిత హెచ్చరిక: పోలీసులను బెదిరించిన పేర్ని నానిపై కఠిన చర్యలు తప్పవు

AP: హోం మంత్రి అనిత హెచ్చరిక: పోలీసులను బెదిరించిన పేర్ని నానిపై కఠిన చర్యలు తప్పవు

Home Minister Anitha: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బెదిరించడం అత్యంత దారుణమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇది పోలీసు యంత్రాంగాన్ని అవమానించే చర్య అని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ… పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

వైసీపీ నేతల తీరు మారలేదు: నకిలీ మద్యంపై ఉక్కుపాదం

ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదని అనిత విమర్శించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై కఠిన చర్యలు తప్పవని, సొంత పార్టీ నేతలున్నా చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని గుర్తుచేశారు. నకిలీ మద్యం తయారీలో భాగస్వాములందరిపైనా కేసులు పెడతామని, దీని వెనుక ఉన్న సూత్రధారులను, కుట్రలను ఛేదిస్తామని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఇటీవల జరిగిన అంబేడ్కర్‌ విగ్రహం కాల్చివేత ఘటన ప్రదేశాన్ని హోంమంత్రి పరిశీలించారు. దళితులకు న్యాయం చేయలేని వైసీపీ నేతలు వారి ముసుగులో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు చట్టాన్ని గౌరవించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అనిత తేల్చిచెప్పారు. ఇదిలావుండగా, మచిలీపట్నంలో ‘చలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ’ నిరసన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు పేర్ని నాని సహా 400 మంది వైఎస్సార్సీపీ నాయకులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసుల విషయంలోనే పేర్ని నాని పోలీస్ స్టేషన్‌లో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad