జనరిక్ మందులను ప్రోత్సహించాలంటూ వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన వారంతా ఈ విషయంపై చొరవచూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సూచించారు. నిర్మలా ఫార్మసీ కళాశాలలో ప్రభుత్వం అధికారికంగా జనఔషధి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. కొన్ని కంపెనీలు మార్కెటింగ్, పర్సంటేజిల ఆశచూపుతూ మందులను అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీరి మాయలో ఎవరూ పడకూడదని మంత్రి కోరారు. మందుల చీటిలపై రోగానికి సంబంధించిన ఔషధం పేరే రాయలని పేర్కొన్నారు.
జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరకే, నేరుగా కంపెనీ నుంచి వచ్చిన ఔషధాన్ని ప్రజలకు అందజేస్తారని చెప్పారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనని చెప్పారు. జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయని చెప్పారు. ఇవన్నీ అత్యంత తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, డ్రగ్ విభాగం అధికారులదేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145 జనఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచబోతున్నామని వివరించారు.