రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అడవులను సంరక్షించడంతో పాటు కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద కొత్తగా అడవుల పెంపకానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజిమెంట్ అండ్ ప్లానింగ్ అధారిటీ (CAMPA) సమావేశం జరిగింది.దేశ భూభాగంలో ప్రస్తుతం 23 శాతం అడవులు విస్తరించి ఉండగా,రాష్ట్రంలో కూడా సుమారు 23శాతం వరకూ అడవులు విస్తరించి ఉన్నాయి.అనగా రాష్ట్ర విస్తీర్ణం లక్షా 62వేల 968 చ.కి.మీలు కాగా 38వేల 60 చ.కి.మీలలో అడవులు విస్తరించి ఉన్నాయి.ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ 2009లో దేశ సర్వోన్నత న్యాయస్థానం కాంపాను ఏర్పాటు చేసిందని తెలిపారు.
రాష్ట్రంలో కాంపా కింద 2022-23లో 225 కోట్ల రూ.ల అంచనాతో అటవీకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.పరిశ్రమలు,డ్యాంలు,వివిధ ప్రాజెక్టుల నిర్మాణం,గనుల తవ్వకం,అటవీ ప్రాంతాల్లో రహదార్ల నిర్మాణానికి అటవీ భూములను వినియోగించిన ప్రాంతాల్లో వినియోగించిన భూముల స్థానే పెద్దఎత్తున అడవులను చేపట్టడమే ఈకాంపా ముఖ్య లక్ష్యమని సిఎస్ స్పష్టం చేశారు.కావున ఎక్కడైతే ఈవిధంగా అటవీ భూములను వినియోగించడం జరుగుతుందో అక్కడ పెద్దఎత్తున అటవీకరణకు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.
అటవీయేతర కార్యకలాపాలకు వినియోగించిన అటవీ భూముల స్థానే ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున కాంపెన్సేటరీ అఫారెస్టేషన్,అడిషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్,పీనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్,సేప్టీ జోన్ అఫారెస్టేషన్,కేచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్,ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ మేనేజిమెంట్ ప్లాన్ కింద పెద్దఎత్తున అడవుల పెంపకానికి సంబంధిత విభాగాలు ద్వారా అటవీ పెంపకానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.అదే విధంగా కాంపా నిధులతో అటవీ సంరక్షణతో పాటు అడవుల్లో తెగుళ్ళ నివారణ,అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ,అటవీ ప్రాంతాల్లో భూసార పరిరక్షణ చర్యలు చేపట్టడం,రక్షిత అటవీ ప్రాంతాల నుండి స్వచ్ఛంధంగా ఆయా గ్రామాలను రీలొకేట్ చేయడం, వన్యమృగ ఆవాస సంరక్షణ,వన్యమృగ కారిడార్ల పరిధిలో పెద్దఎత్తున చెట్ల పెంపకం అటవీ పునరుద్ధరణ,వన్యమృగ సంరక్షణ చర్యల్లో భాగంగా యానిమల్ రెస్క్యూ మరియు వెటర్నరీ ట్రీట్మెంట్ సౌకర్యాల కల్పన,మేనేజిమెంట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ,బయోలాజికల్ రీసోర్సెస్ వంటి చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.జవహర్ రెడ్డి సూచించారు.
అంతకు ముందు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ పారెస్ట్ వై.మదుసూధన్ రెడ్డి,చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(కాంపా)బికె సింగ్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంపా కార్యకలాపాలకు మంజూరైన నిధులు వాటి వినియోగం తదితర వివరాలను తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్,దృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొనగా,గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి పలువురు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.