Ap Renewable Energy Skilling Drive : ఆంధ్రప్రదేశ్ గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవంలో కేంద్ర బిందువుగా మారేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ లక్ష్యంతో ఆగస్టు 6, 2025న విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్‌ను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (APSSDC), స్వనీతి ఇనిషియేటివ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతంగా మార్చటమే కాకుండా, సౌర-పవన శక్తి రంగాలలో నైపుణ్య కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చే లక్ష్యంతో కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు.
సమావేశం సాగునుందిలా..
ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పరిశ్రమల ప్రతినిధులు, ముఖ్య భాగస్వాములు హాజరుకానున్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాన్ని సాధించేందుకు వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఈ గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవంలో కీలక పాత్ర పోషించనుంది.
యువతకు నైపుణ్య శిక్షణ
ఈ పునరుత్పాదక ఇంధన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు సౌర-పవన శక్తి రంగాలలో నైపుణ్య శిక్షణను అందించనుంది. ఈ శిక్షణ తయారీ, ఇన్‌స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమం కేవలం నైపుణ్య శిక్షణతో ఆగకుండా, క్లీన్ ఎనర్జీ, వాతావరణ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి, పరిశ్రమల వృద్ధికి దోహదపడేలా రూపొందించబడింది. రాష్ట్రం 2030 నాటికి 160 గిగావాట్ల సౌర – పవన శక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించింది.
గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
ఇక ఈ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలోనే కాకుండా, గ్లోబల్ టాలెంట్ ఎగుమతిదారుగా కూడా నిలవనుంది. ఈ సమావేశంలో సౌర, పవన శక్తి పరిశ్రమల దిగ్గజాలు, పాలసీ నిర్ణేతలు, శిక్షణ సంస్థలు కలిసి మూడు హై-ఇంపాక్ట్ ప్యానెల్ చర్చలను నిర్వహించనున్నారు. ఈ చర్చలు డిమాండ్ ఆధారిత, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్ రూపొందించడంపై దృష్టి సారిస్తాయి. అదనంగా, ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ప్రారంభించనున్నారు, ఇది పరిశ్రమలతో సమన్వయంతో నైపుణ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ రంగంలో నైపుణ్య కేంద్రంగా స్థాపించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమివ్వనుందని తెలుస్తుంది.


