వైసీపీ ప్రభుత్వం హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం( Liquor Scam) కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజ్(Raj KasiReddy) కోసం ఏపీ సిట్ బృందం గాలింపును తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. కసిరెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డి పాత్ర కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు.
ఈ కుంభకోణం వెనుక ఉన్న కీలక వ్యక్తుల వివరాలు రాబట్టాలంటే కసిరెడ్డి విచారణ అత్యంత ముఖ్యమని భావిస్తున్న దర్యాప్తు అధికారులు ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం 10 ప్రత్యేక సిట్ బృందాలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కాగా ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు అయిన కసిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పని చేశారు. మద్యం తయారీదారుల నుంచి డబ్బులు వసూలు చేశారని.. దాదాపు రూ. 3వేల కోట్ల వరకూ జగన్ ప్యాలెస్‌కు చేర్చారని కసిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.