Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: మిర్చి రైతుల కోసమే సీఎం ఢిల్లీకి

AP: మిర్చి రైతుల కోసమే సీఎం ఢిల్లీకి

రాజకీయాలు వద్దు

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

- Advertisement -

తగ్గిన మిర్చి ఎగుమతులు

బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడం వల్ల మళ్లీ ఆదేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం ఇప్పటి వరకూ మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు.

మిర్చి రైతులు సహకరించాలి
రాష్ట్రంలోని మిర్చి రైతులకు సాధ్యమైనంతమేర సహకరించాలని, ప్రస్తుతం ఉన్న కేంద్రం మద్దతు ధరను కూడా పెద్ద ఎత్తున పెంచాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళుతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్రానికి ఇప్పటి వరకూ నాలుగు లేఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి రాశారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల బృందంతో చర్చించనున్నారని, చర్చల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

వక్రీకరిస్తారా? రాజకీయం చేస్తారా?

అయితే ఈ విషయాలను అన్నింటినీ వక్రీకరిస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాజకీయం చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రయత్నించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. మిర్చి రేటు రూ.13 వేలకు పడిపోయిందని ఆరోపిస్తున్నారని, అయితే గత పదేళ్లలో మిర్చి ధరలు పరిశీలిస్తే అత్యధికంగా రూ.13,600/- లు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. కేవలం గత రెండేళ్లు మాత్రమే అంతర్జాతీయంగా కొన్ని కారణాలు వల్ల మిర్చి రైతుకు రూ.20వేల ధర పలికిందన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70 శాతం జనాభాకి ప్రధాన జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలను గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. భూసార పరీక్షలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, వ్యవసాయ యాంత్రీకరణ క్రింద ఒక్క పైసా కూడా కేటాయించ లేదన్నారు. బిందు సేధ్యాన్ని ప్రోత్సహించే విధంగా డ్రిప్ / స్ప్రింక్లర్లను ఏఒక్కరికీ పంపిణీ చేయలేదన్నారు. దాదాపు రూ.1600 కోట్లు మేర ధాన్యం కొనుగోలు బకాయిలను పెట్టిపోతే, తాము అధికారంలోకి వచ్చిన వెంటే రైతులకు ఆ సొమ్మును చెల్లించామన్నారు.

ఆ ఘనత మీదేనంటూ మండిపాటు

2020 జనవరి మాసంలో బహిరంగ మార్కెట్ లో మిర్చి ధర దాదాపు రూ.12,000/- ల వరకూ ఉంటే అదే సమయంలో గత ప్రభుత్వం మిర్చికి రూ.7,000/- కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులకు పూర్తి స్థాయిలో నష్టాన్ని కలిగించిన ఘనత గత ప్రభుత్వానిదన్నారు. ఆ సమయంలో కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్రింద ఒక్క పైసాకూడా అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2017 లో దాదాపు రూ.138 కోట్ల మేర మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కేటాయించి రైతులను పెద్ద ఎత్తున ఆదుకున్నామన్నారు. వచ్చే బడ్జెట్ లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను పెద్ద ఎత్తున ప్రతిపాదిస్తామన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీరావు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు మరియు రైతు బజార్ల సి.ఇ.ఓ. విజయ సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News