AP PGCET 2026 Results Release: ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. మే 8 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఆయన ‘ఎక్స్’ వేదికగా ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తంగా 19,118 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం 16,406 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,020 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు అధికారులు ఫలితాల డేటా వెల్లడించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో మొత్తం 30 సబ్జెక్టులకు సంబంధించిన పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది పీజీసెట్ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు. ఈ అద్భుతమైన ఫలితాలు అభ్యర్థుల కృషి, పట్టుదలకు నిదర్శనమన్నారు. విజయం సాధించిన ప్రతి అభ్యర్థికీ ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆయన ఆకాక్షించారు. అభ్యర్థులు తమ ఫలితాలను www.cets.apsche.ap.gov వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
Also read: YS Sharmila: రాహుల్‌తో షర్మిల భేటీ.. కర్ణాటక నుంచి రాజ్యసభకు లైన్ క్లియర్?

