Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్PM Viswakarma scheme: పియం విశ్వకర్మ పథకంలో 2.5 లక్షల మందిని రిజిస్టర్ చేయండి

PM Viswakarma scheme: పియం విశ్వకర్మ పథకంలో 2.5 లక్షల మందిని రిజిస్టర్ చేయండి

వ్యాపార అభివృద్ధికి లక్ష రూపాయల రుణం

వివిధ చేతివృత్తి దారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 17 నుండి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో రాష్ట్రంలో మొదటి ఏడాదిగా రెండున్నర లక్షల మంది చేతివృత్తి దారులను రిజిష్టర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈమేరకు శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన పియం విశ్వకర్మ యోజన పథకంపై సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి పనిముట్లతో సాంప్రదాయ పద్ధతిలో చేతి వృత్తులు చేసుకునే వారిని ఆదుకునేందుకు నూరుశాతం నిధులు సమకూర్చినుందని కావున రాష్ట్రం నుండి వీలైనంత మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

2023-2028 కాలంలో ఐదేళ్ళ పాటు ఈపధకాన్ని అమలు చేసేందుకు ఈనెల 17న ఈపధకాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన చేతి వృత్తుల వారికి ఆధునిక నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చి వారికి ఆధునిక పనిముట్లు అందించడం తోపాటు రుణం సౌకర్యాన్ని మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తారని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.ఈపధకంలో 18 రకాల చేతి వృత్తిదారులు అర్హులని తెలిపారు.అనగా వడ్రంగి,పడవల తయారీ, కమ్మరి,ఆయుధాల తయారు చేసేవారు,సుత్తి ఇతర పనిముట్లు తయారు చేసేవారు,తాళాలు రిపేరు చేసేవారు,శిల్ప కళాకారులు, స్వర్ణకారులు,కుమ్మరి,చెప్పులు కుట్టేవారు,తాపీ,బుట్ట,చాప,చీపుర్లు,బొమ్మలు తయారు చేసే వారు,క్షురకులు,పూల దండలు చేసేవారు,రజకులు,దర్జీలు మరియు చేపల వలలు తయారు చేసే వారు ఈపధకాన్ని అర్హులని సిఎస్ పేర్కొన్నారు. ఈపధకంలో అర్హులైన వారికి మొదటి విడతగా వారి వ్యాపార అభివృద్ధికి లక్ష రూపాయల రుణం అందిస్తారన్నారు.

ఆ రుణం తీర్చిన పిదప రెండవ విడతగా మరో రెండు లక్షలు వెరసి మూడు లక్షల రూ.లు 5శాతం స్థిర వడ్డీతో హామీలేని రుణం అందిస్తారని తెలిపారు. ప్రతి లబ్దిదారుకు 15వేల రూ.ల విలువైన పనిముట్లు రాయితీ ద్వారా అందిస్తారన్నారు. అదే విధంగా శిక్షణా సమయంలో భోజనం,వసతితో పాటు రోజుకు 500 రూ.లు వంతున స్టైఫండ్ గా శిక్షణ పూర్తయ్యాక ఇస్తారని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేగాక వారి బ్యాంకు ఖాతా ద్వారా చేసే ప్రతి డిజిటల్ లావాదేవికి ఒక రూపాయి వంతున గరిష్టంగా నెలకు 100 లావాదేవీలకు చెల్లించబడునని తెలిపారు.అయితే ప్రతి లావాదేవి 25రూ.లు ఆపైన ఉండాలని చెప్పారు.అర్హులైన ప్రతి లబ్దిదారుకు మార్కెటింగ్, బ్రాండింగ్ వంటివి కల్పిస్తారని తెలిపారు. ఈపధకానికి కుటుంబ వృత్తిగా చేస్తున్న 18 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు అర్హులని,కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులని తెలిపారు. అంతే గాక కుటుంబంలో ఏఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండ కూడదని,గత ఐదేళ్ళలో ఏ ఇతర పధకం కింద బ్యాంకు నుండి రుణం పొంది బాకీపడి ఉండకూడదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థుల నమోదుకు గ్రామ వార్డు సచివాలయాల్లోని కామన్ సర్వీస్ సెంటర్(సిఎస్సి) మరియు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సిఎస్సిల్లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదు సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు పాస్ పుస్తకం,రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. కావున ఈపధకంలో చేతి వృత్తుల వారికి ప్రయోజనం కలిగేలా అర్హులైన వారందరినీ రిజిష్టర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈసమావేశంలో రాష్ట్ర పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత,పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆశాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్,సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ లక్ష్మి షా, విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్,స్కిల్ డెవలప్మెంట్ సిఇఓ కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News