వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. అయితే 4వ తేదీన సినిమా షూటింగ్ కారణంగా బిజీగా ఉంటానని.. 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ రూపొందిచిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషనల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాని సంగతి తెలిసిందే. అనంతరం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి కోర్టు ఆదేశాలు పాటిస్తూ ఆర్జీవీ విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.