Homeఆంధ్రప్రదేశ్Recruitment : పోలీస్ పోస్టుల భర్తీకి సమరభేరి.. జగన్‌తో నిరుద్యోగ జేఏసీ భేటీ

Recruitment : పోలీస్ పోస్టుల భర్తీకి సమరభేరి.. జగన్‌తో నిరుద్యోగ జేఏసీ భేటీ

AP Police Recruitment Age Limit Relaxation :  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.

- Advertisement -

పోలీస్‌ శాఖలో దాదాపు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కనీసం 10 వేల పోలీస్‌ ఉద్యోగాలైనా వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీఎస్‌యూ జేఏసీ కన్వీనర్‌ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు శ్రీ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచేలా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని కోరారు.

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతోకాలంగా పోలీస్‌ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారని జేఏసీ ప్రతినిధులు శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ముందడుగు వేయకుండా నిరుద్యోగులను గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకుంటూ, ఆర్థికంగా భారాన్ని మోస్తున్న నిరుద్యోగ యువతతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.

2022లో చివరిసారిగా పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైందని, ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్‌ రాకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి కారణంగా ఎంతోమంది అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసిన కారణంగా అభ్యర్థులు నష్టపోకుండా వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

పోలీస్‌ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడం వల్ల ఒకవైపు నిరుద్యోగ యువతకు అవకాశాలు దూరమవుతుండగా, మరోవైపు పోలీస్‌ శాఖలో సిబ్బంది కొరత కూడా కొనసాగుతోందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో కనీసం 10 వేల పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేసేలా ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ తరఫున ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

జేఏసీ ప్రతినిధుల సమస్యలను, విజ్ఞప్తులను సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్‌.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీస్‌ ఉద్యోగాల భర్తీతో పాటు అభ్యర్థుల వయోపరిమితి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిరుద్యోగుల తరఫున అవసరమైన ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో ఏపీఎస్‌యూ జేఏసీ కన్వీనర్‌ ఎంబేటి రామచంద్రతో పాటు జేఏసీ సభ్యులు వై. గణేష్‌, జె. నాగార్జున, ఎస్. సాంబశివరావు, వి. గురవారెడ్డి, ఎం. నవీన్‌, యు. అభిరామ్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News