మరో రెండు రోజుల్లో జరగనున్న న్యూఇయర్ వేడుకలపై(New Year celebrations) విజయవాడ(Vijayawada) పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకల సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను ఓ ప్రకటనలో తెలియజేశారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఫ్లైఓవర్లు, పశ్చిమ బైపాస్‌పై వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే బెంజ్ సర్కిల్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌లపైనా ఆంక్షలు ఉంటాయన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్, న్యూసెన్స్ కేసులను అరికట్టడానికి ప్రత్యేక బలగాలను నియమించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా మద్యం తాగి రోడ్ల మీద హల్‌చల్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటిస్తూ సంతోషంగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. వేడుకలను ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులకు సహకరించాలని సీపీ సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు.