పోలీసులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం(AP Police) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు.
తీవ్ర ఒత్తిడితో పనిచేసే పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తక్షణమే తన వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలీసు ఉద్యోగులుగా మహిళలు ఉన్నారని జగన్ మరిచారా అని సంఘం సభ్యురాలు భవాని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు.
ఇదిలా ఉంటే జగన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత(Vangalapudi anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు జగన్ ప్రయత్నించారని విమర్శించారు. పోలీసులపై జగన్ వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. కాగా రాప్తాడు పర్యటన చేపట్టిన జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసుల బట్టలు ఊడదీసి నిలబడతామని వార్నింగ్ ఇచ్చారు.