Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Road safety : రహదారులపై రక్తాభిషేకం.. ఏపీలోని ఆరు జిల్లాల్లో మృత్యుఘోష.. కేంద్రం కీలక నిర్ణయం!

Road safety : రహదారులపై రక్తాభిషేకం.. ఏపీలోని ఆరు జిల్లాల్లో మృత్యుఘోష.. కేంద్రం కీలక నిర్ణయం!

Road safety in Andhra Pradesh : అద్దంలా మెరిసే రోడ్లు.. దూసుకెళ్లే వాహనాలు.. కానీ ఆ ప్రయాణం గమ్యస్థానానికి చేరుస్తుందో లేదో తెలియని దయనీయ స్థితి! ఏపీలోని కొన్ని రహదారులు నిత్యం రక్తమోడుతూ మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ప్రాణాలు తోడేసే పెనుగండాలుగా పరిణమించిన ఈ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తాజాగా జరిపిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న వంద జిల్లాల జాబితాలో మన రాష్ట్రంలోని ఆరు జిల్లాలు చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ జిల్లాలు ఏవి? అక్కడ మరణమృదంగానికి కారణాలేంటి? మరణాల రేటును సున్నాకు తగ్గించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ‘మాస్టర్ ప్లాన్’ ఏమిటి?

- Advertisement -

కేంద్ర అధ్యయనంలో విస్తుపోయే నిజాలు : కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH), ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ భద్రతా స్థితిగతులు ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. 2023, 2024 సంవత్సరాల్లో జరిగిన ప్రమాదాలు, మరణాల గణాంకాలను విశ్లేషించిన కేంద్రం, దేశంలోని అత్యంత సంక్లిష్టమైన 100 జిల్లాలను గుర్తించింది. ఇందులో ఉత్తరప్రదేశ్ (20), తమిళనాడు (19) తర్వాత ఏపీ నుంచి 6 జిల్లాలు ఉండటం గమనార్హం.

ప్రమాదాల జాబితాలో ఉన్న జిల్లాలు:
ఉమ్మడి ప్రకాశం
గుంటూరు
నెల్లూరు
అనంతపురం
కడప
చిత్తూరు

జీరో ఫెటాలిటీ కారిడార్‌లే లక్ష్యం : మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో అమలు చేసిన ‘జీరో ఫెటాలిటీ కారిడార్’ (ZFC) విధానం అద్భుత ఫలితాలను ఇచ్చింది. అదే బాటలో 2030 నాటికి ఈ ఆరు జిల్లాల్లో రోడ్డు ప్రమాద మరణాలను పూర్తిగా అరికట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ‘యుద్ధప్రాతిపదికన’ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఏపీ నుంచి ఒక ప్రధాన రహదారిని జాతీయ స్థాయి ‘సురక్షిత కారిడార్’గా ఎంపిక చేయనున్నారు.

ముందస్తు రక్షణ చర్యలు ఇలా : ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్రం ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించింది:
బ్లాక్ స్పాట్స్ గుర్తింపు: ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను  గుర్తించి, ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దడం.
ఆడిట్ & నిఘా: ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే అధికారులు రహదారి భద్రతా ఆడిట్ నిర్వహించి, అవసరమైన చోట క్రాష్ బ్యారియర్లు, సూచికలు ఏర్పాటు చేయాలి.
కఠిన నిబంధనలు: అతివేగం, హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం మరియు మద్యం సేవించి వాహనం నడిపేవారిపై పోలీసుల కొరడా ఝుళిపించాలి.
ఫిట్నెస్ పరీక్షలు: బస్సులు, లారీలు, ఆటోలకు క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు తనిఖీ చేయాలి.

గోల్డెన్ అవర్ – నగదు రహిత చికిత్స : ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆదుకునేందుకు ‘ట్రామా కేర్ సెంటర్ల’ను బలోపేతం చేయనున్నారు. హైవేల వెంబడి అంబులెన్సులను అందుబాటులో ఉంచడంతో పాటు, బాధితులకు ఆసుపత్రుల్లో ‘నగదు రహిత చికిత్స’ అందించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం, సమయానికి వైద్యం అందించి మరణాలను తగ్గించడమే పరమావధిగా ఈ చర్యలు చేపడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News