AP academic calendar 2026-27 : వేసవి సెలవుల సుదీర్ఘ విరామం ముగిసింది. ఇన్నాళ్లూ ఆటపాటలతో గడిపిన విద్యార్థులు తిరిగి అక్షరాల బాట పట్టే సమయం వచ్చేసింది. పాఠశాలల ప్రాంగణాలు మళ్లీ పిల్లల సందడితో కళకళలాడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా తరగతులు రేపటి నుంచి (జూన్ 12) పునఃప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏడాదంతా విద్యాబోధన, పరీక్షల నిర్వాహణ ఎప్పుడెప్పుడు జరగాలనే దానిపై పూర్తిస్థాయి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
పకడ్బందీగా అకడమిక్ క్యాలెండర్: 229 రోజులు బడి.. 87 రోజులు సెలవు : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నూతన విద్యా సంవత్సరాన్ని (2026-2027) పక్కా ప్రణాళికతో డిజైన్ చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ఈ క్యాలెండర్‌ను విద్యాశాఖ అధికారులు ఆవిష్కరించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా, అదే సమయంలో విద్యా ప్రమాణాలు పెంచేలా క్యాలెండర్‌ను సమతుల్యంగా రూపొందించారు.
మొత్తం పనిదినాలు: ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 229 రోజుల పాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. సిలబస్ సకాలంలో పూర్తి చేయడానికి, పునశ్చరణ (రివిజన్) చేయడానికి ఈ పనిదినాలు అనుకూలంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
సెలవుల వివరాలు: పండుగలు, జాతీయ దినోత్సవాలు, ఆదివారాలు అన్నీ కలుపుకుని ఈ ఏడాదికి గాను 87 రోజులను సెలవు దినాలుగా విద్యాశాఖ ప్రకటించింది. దసరా, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలకు విద్యార్థులకు తగినంత విరామం దొరికేలా ఈ క్యాలెండర్‌లో వెసులుబాటు కల్పించారు.
పక్కా ప్రణాళికతో పరీక్షల షెడ్యూల్ : సాధారణంగా విద్యా సంవత్సరం మధ్యలో పరీక్షల తేదీలపై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కొంత గందరగోళం ఉంటుంది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే మొత్తం పరీక్షల షెడ్యూల్‌ను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్స్ (FA), సమ్మేటివ్ అసెస్‌మెంట్స్ (SA) ఎప్పుడెప్పుడు నిర్వహించాలి? సిలబస్ ఏ నెలలోపు ఎంత శాతం పూర్తి చేయాలి? అనే మార్గదర్శకాలను ఇందులో పొందుపరిచారు. తద్వారా ఉపాధ్యాయులు ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని, విద్యార్థులను వార్షిక పరీక్షలకు సమాయత్తం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

