AP SIPB Approvals 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి గట్టి అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11వ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఒక్క సమావేశంలోనే రూ.1.14 లక్షల కోట్ల విలువైన 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. ఇవి పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా 67 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తాయి.
సమావేశం మూడు గంటల పాటు సాగింది. అధికారులు ప్రతి ప్రాజెక్టు వివరాలు, అమలు అవకాశాలు, రాష్ట్రానికి ప్రయోజనాలు వివరించారు. అతి కీలకమైనది ఐటీ రంగంలో ‘రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్’. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి (FDI)గా రూ.87,520 కోట్ల పెట్టుబడితో విజయవాడలో ఏర్పాటవుతుంది. ఇది 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడంలో ఐటీ మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారు. “లోకేశ్ ప్రయత్నాలు రాష్ట్రానికి ‘రైడెన్’ తీసుకువచ్చాయి” అంటూ చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “గత 15 నెలల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి మైలురాయి” అన్నారు. మొత్తంగా SIPB సమావేశాల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఇవి పూర్తయితే 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి కంపెనీలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టుల్లో ఇంధన రంగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడి, పర్యాటకంలో రూ.8,000 కోట్లు, ఏరోస్పేస్‌లో రూ.12,000 కోట్లు ఉన్నాయి. వీటితో విజయవాడ, విశాఖ, అమరావతి వంటి ప్రాంతాలు ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌లుగా మారతాయి. గత సమావేశాల్లో అడానీ, కాగ్నిజెంట్ వంటి భారీ పెట్టుబడులు ఆమోదించగా, ఇప్పుడు రైడెన్‌తో మరో రికార్డు. చంద్రబాబు ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంతో పని చేస్తోంది. ఈ అభివృద్ధి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని నిపుణులు అంచనా.


