రాష్ట్రంలో త్వరలో తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్నిఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలో అవసరమైన చర్యలు తీసుకోనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు, యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ పరిశ్రమలు, సంస్థల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ అందించి వారికి తగిన ఉద్యోగ ఉపాథి అవకాశాలు మెరుగు పర్చేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కళాశాల సహా మొత్తం 26, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు సహా 192 చోట్ల ఐటిఐలు, పాలిటెక్నిక్ కళాశాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, నాక్ కేంద్రాల అనుసంధానంతో స్కిల్ హబ్లు, 55 ప్రాంతాల్లో స్కిల్ స్పోక్సు ఏర్పాటు ద్వారా ఇప్పటికే వివిధ రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సిఎస్. జవహర్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే జర్మన్ భాషలో నైపుణ్య శిక్షణ పొందిన నర్సింగ్ విద్యార్ధిణులు త్వరలో జర్మనీ దేశానికి వెళ్ళనున్నారని సిఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్ధ, రాష్ట్రంలోని సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిటిడిసి కేంద్రాల ద్వారా మరిన్నిశిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సెర్ప్ సిఇఓను ఆదేశించారు. పరిశ్రమలు,చేనేత జౌళి శాఖ, సెర్ప్,ఉన్నత విద్యాశాఖ, ఐటి అండ్ ఎలక్ర్టానిక్స్, మత్స్య తదితర విభాగాలు కన్వరెన్సు విధానంలో మరిన్ని శిక్షణా కార్యక్రమాలకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈసమావేశంలో విద్యాశాఖ కమీషనర్ సురేశ్ కుమార్, నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ సిఇఓ వినోద్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్,ఆశాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామల రావు, మత్స్యశాఖ కమీషనర్ కె.కన్నబాబు వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.