AP weather updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వర్షాకాలం ముగిసిన వెంటనే చలిగాలులు గజగజ వణికిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలుల ప్రభావం మొదలై.. మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతున్నది.
మొంథా నిష్క్రమణతో పెరిగిన చలి: రాష్ట్రంలోని ప్రజలు తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల మధ్య వరకు ఉండాల్సిన ఈశాన్య రుతుపవనాలు అనేవి ‘మొంథా’ తుపాను ప్రభావంతో త్వరగానే నిష్క్రమించడంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు వాతావరణ నిపుణులు ఈ ఏడాదిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏపీలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చస్తున్నారు. అరకు వంటి ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్స్ ఉందని అధికారులు వాతావరణ నిపుణులు తెలిపారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-state-weather-forecast-updats/
జాగ్రత్తలు తప్పనిసరి: ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉండడంతో ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె మరియు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు రాత్రివేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.


