AP TDR Bonds Scam : ఆంధ్రప్రదేశ్‌లో టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్స్ స్కాం వందల కోట్లలో జరిగిందని మంత్రి పొంగూరు నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తణుకు మున్సిపాలిటీలో రూ.754 కోట్ల విలువైన బాండ్స్‌లో రూ.691 కోట్ల అవకతవకలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ బాండ్స్ విలువ రూ.63.24 కోట్లు మాత్రమే కాగా, వాటిని ఉన్నత ధరలకు జారీ చేసినట్లు నారాయణ తెలిపారు.
ALSO READ: Women Judges : న్యాయపీఠంపై నారీశక్తి.. మహిళా ‘జస్టిస్’లలో తెలంగాణకే అగ్రస్థానం!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ అవకతవకలు జరిగాయని, భూమి ఒకచోట ఉంటే, వేరే చోట డోర్ నంబర్లు వేసి విలువను గణనీయంగా పెంచినట్లు ఆయన ఆరోపించారు. ఉదాహరణకు, తణుకులో ఎకరం రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన భూమిని, చదరపు అడుగుల లెక్కలో రూ.10 కోట్లుగా చూపించారని నారాయణ వివరించారు. ఇలాంటి అవకతవకలు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలోనూ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ స్కామ్‌పై సీఐడీ, యాంటీ-కరప్షన్ బ్యూరో విచారణ జరుపుతున్నాయని, త్వరలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.9.74 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిందని, ప్రజలపై చెత్త పన్ను విధించి ఆర్థిక భారం మోపిందని ఆయన విమర్శించారు.
అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా అడుగులు వేస్తుందని నారాయణ తెలిపారు.


