ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 12 నుండి జనవరి 12 వరకు నెలరోజుల పాటు బదిలీలు కొనసాగనున్నాయి. ఉన్నతాధికారులతో రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని గ్రేడ్-2 హెడ్మాస్టర్లు కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలని, వారికే బదిలీలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ ఉపాధ్యాయుల బదిలీలకు మినహాయింపు ఇచ్చింది. బదిలీల ప్రక్రియను ఆన్ లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించనున్నారు.
కాగా.. ఏపీలోని హైస్కూళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులకు ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ బదిలీలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 10వ తరగతులకు 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా కావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సంబంధిత సబ్జెక్టు టీచర్లు అందుబాటులో లేనిచో.. అర్హత కలిగిన ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమించనున్నారు. మిగిలిన ఎస్జీటీలను ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి బదిలీ చేయనున్నారు.