Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్AP Tourism : జల విహారం.. ఆనందాల తీరం! రాష్ట్రంలో 8 చోట్ల హౌస్‌ బోట్ల...

AP Tourism : జల విహారం.. ఆనందాల తీరం! రాష్ట్రంలో 8 చోట్ల హౌస్‌ బోట్ల సందడి..

 AP Tourism House Boats : కేరళ వెళ్తేనే హౌస్ బోట్లు.. కశ్మీర్ వెళ్తేనే షికారా విహారం.. ఈ మాటలు ఇక పాతరాతలే! మన రాష్ట్రంలోని నదులు, జలాశయాలు ఇక కొత్త అందాలతో కళకళలాడబోతున్నాయి. ప్రకృతి ఒడిలో, నీటి అలల మధ్య.. అద్భుతమైన విందు, వినోదం, రాత్రి బస (Night Stay) చేసేలా పర్యాటక శాఖ భారీ ప్రణాళికలు రచించింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో త్వరలోనే ‘హౌస్‌ బోట్లు’ పర్యాటకులను అలరించిననున్నాయి. గతంలో నిర్వహణ లోపంతో మూలనపడ్డ బోట్ల కథ పునరావృతం కాకుండా, ఈసారి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ప్రైవేట్ ఆపరేటర్లకు పగ్గాలు అప్పగిస్తోంది. 

- Advertisement -

ప్రైవేట్ చేతికి పగ్గాలు – రూ.10 కోట్ల పెట్టుబడి : రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన హౌస్ బోట్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సింగిల్, డబుల్ బెడ్ రూం హౌస్ బోట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వివిధ ప్రైవేట్ సంస్థలు సుమారు రూ.10 కోట్ల పెట్టుబడులతో ఈ బోట్లను అందుబాటులోకి తేనున్నాయి. దీనివల్ల పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, నిర్వహణ లోపాలు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు.

హౌస్ బోట్లు ఎక్కడెక్కడంటే : ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ క్రింది ప్రాంతాలను హౌస్ బోట్ల నిర్వహణకు ఎంపిక చేశారు:
సూర్యలంక బీచ్
విజయవాడ భవానీ ద్వీపం (కృష్ణా నది)
రాజమహేంద్రవరం – సరస్వతీ ఘాట్
రాజమహేంద్రవరం – పుష్కర ఘాట్
గండికోట (వైఎస్సార్ కడప జిల్లా)
కొండకాకర్ల సరస్సు (అనకాపల్లి జిల్లా)
గంభీరం జలాశయం (విశాఖపట్నం జిల్లా)
తాజంగి జలాశయం (అల్లూరి జిల్లా)

వీటితో పాటు నెల్లూరులోని స్వర్ణాల చెరువు, కర్నూలులోని గార్గేయపురం, కోనసీమలోని ఎదుర్లంకలోనూ బోట్ల నిర్వహణకు తాత్కాలిక అనుమతులు జారీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ భవానీ ద్వీపంలో సీఎం చంద్రబాబు హౌస్ బోట్లను ప్రారంభించగా.. మిగిలిన చోట్ల కలెక్టర్ల ద్వారా పర్యావరణ, జలవనరుల అనుమతులు తుది దశలో ఉన్నాయి.

రొమాంటిక్ ఫ్లోట్’ నుంచి.. డిన్నర్ దాకా : కేవలం బోటు షికారు మాత్రమే కాదు, విలాసవంతమైన అనుభూతిని పంచేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఒక్కో బోటులో ఆరుగురు సౌకర్యవంతంగా ఉండేలా, రాత్రిళ్లు బస చేసేలా బెడ్ రూమ్స్ ఉంటాయి.  ‘రొమాంటిక్ ఫ్లోట్’, ‘డైన్ బోట్’ (Dine Boat) పేరుతో ప్రత్యేక బోట్లు ఉంటాయి. వీటిలో పుట్టినరోజు వేడుకలు, మ్యారేజ్ యానివర్సరీలు, చిన్నపాటి సమావేశాలు నిర్వహించుకోవచ్చు. నది మధ్యలో లంచ్, డిన్నర్ చేసే వెసులుబాటు ఉంటుంది.

భద్రతకు పెద్దపీట: కంట్రోల్ రూమ్‌ల పహారా : గోదావరి దుర్ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి భద్రత విషయంలో రాజీపడటం లేదు. బోట్లు నడిపే ప్రతి ప్రాంతంలో విధిగా ‘కంట్రోల్ రూం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తారు. వరద ఉద్ధృతి ఉన్నప్పుడు బోట్లను నిలిపివేయడం, లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తారు. మౌలిక సదుపాయాలైన జెట్టీలు, విద్యుత్, తాగునీటిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. త్వరలోనే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో, పర్యాటకులు ఈ సరికొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News