రానున్న నైరుతి రుతుపవన కాలంలో సంభవించబోయే తుఫానులు, వరదలు వంటి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆదేశించారు. రానున్న నైరుతి రుతుపవనాలు సన్నద్ధతపై వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖలు,కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వాతావరణ శాఖ అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీకి కేరళ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశం ఉందని, జూన్ 8వ తేదీ నాటికి రాష్ట్రంలో ప్రవేశించి 12 వ తేదీకి రాష్ట్ర మంతటా విస్తరించే వీలుందని తెలుస్తోందన్నారు. నైరుతి రుతుపవన కాలంలో సంభవించబోయే ఎటువంటి తుఫానులు లేదా వరదలనైనా సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా పూర్తి సన్నద్దతతో ఉండాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత మండలాలు,నదీ పరివాహక ప్రాంతాల్లో మండలాల్లో ప్రత్యేక ముందస్తు ఏర్పాట్లతో అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులను సిఎస్. జవహర్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ,పోలీస్,అగ్నిమాపక,మత్స్య,జల వనరులు,ఆర్అండ్బి,పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పౌర సరఫరాలు, ట్రాన్సుకో, వైద్య ఆరోగ్య తదితర శాఖలు వారి వారి శాఖల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై తగిన కార్యాచరణతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తుఫానులు, వరదలు సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు వీలుగా అవసరమైన పరికరాలు, ఇతర సామాగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు.
గత ఏడాది తిరుపతి నగరంలో అండర్ పాస్ వద్ద నీరు నిలిచి ప్రాణ నష్టం జరిగిందని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రమాదకర అండర్ పాస్ల వద్ద శాశ్వత చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. బలహీనంగా ఉన్న ఏటి గట్టలు, కాలువ గట్లు, రిజర్వాయర్ల గట్లు, వివిధ రదారులపై గల కల్వర్టులను తనిఖీ చేసి వాటి పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలని జలవనరులు, ఆర్అండ్బి, పంచాయితీరాజ్ తదితర శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు,శాఖలైన ఎన్డిఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్సు,ఇండియన్ కోస్టు గార్డు,రైల్వే,టెలికమ్యునికేషన్స్ వంటి సంస్థలు కూడా ఏటాలానే తుఫానులు, వరదలు వంటి విపత్తులను ఎదుర్కునేందుకు రాష్ట్రా ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహాయ సహాకారాలు అందించేందుకు పూర్తి సన్నధ్దతతో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సూచించారు.
అంతకు ముందు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రానున్న నైరుతి రుతుపవనాల సన్నద్ధత ఏర్పాట్లపై వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ముఖ్యంగా సన్నాహక ఏర్పాట్లలో భాగంగా అవసరమైన మెన్ మెటీరియల్ ను ముందుగానే సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని ఆయా శాఖలకు సూచించారు.అదే విధంగా సిబ్బందికి తగిన శిక్షణ సహాయ చర్యలకు సంబంధించి తగిన టీంలను ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, శాంతి భద్రతల విభాగం అదనపు డిజిపి శంకభత్ర బాగ్చి, ఎపిఎస్పి, ఎస్డిఆర్ఎఫ్ డిఐజి రాజకుమారి, కార్యదర్శి పి.భాస్కర్,ఎపిఎస్డిఎంఏ ఇడి నాగరాజు, అమరావతి భారత వాతారణశాఖ డైరెక్టర్ స్టెల్లా, సీనియర్ మెట్రాలజిస్ట్ డా.ఎంఎం అలీ, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా దృశ్య మాద్యమం ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఎన్డిఆర్ఎఫ్, కోస్టు గార్డు తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
AP: తుఫాను విపత్తులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES