Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: క‌సితో ఓటేసి..ఫ్యాన్ రెక్క‌లు ముక్క‌లు చేసిన..

AP: క‌సితో ఓటేసి..ఫ్యాన్ రెక్క‌లు ముక్క‌లు చేసిన..

వైసీపీకి కేవ‌లం 9 సీట్లే

ఇది ఒక నిశ‌బ్ద విప్ల‌వం… ఇది ఒక సునామీ… ఇది ఒక చారిత్ర‌క ఘ‌ట్టం…ఇది ఒక ప్ర‌భంజ‌నం. తెలుగుబిడ్డ‌లు తిర‌గ‌బ‌డ్డారు. క‌సితో ఓటు వేశారు. నిరంకుశ నియంతృత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడారు. రాష్ట్రానికి ప‌ట్టిన పీడ విర‌గ‌డ‌య్యేలా త‌మ నిర్ణ‌యాన్ని చాటి చెప్పారు. ప్ర‌జాస్వామ్యానికి ప‌ట్టం క‌ట్టారు. అహంకార పూరిత పాల‌కుల‌కు గుణ‌పాఠం చెప్పారు. ఏపీ ఓట‌ర్లు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఇచ్చిన విస్ప‌ష్ట తీర్పుతో కూట‌మికి అధికార ప‌గ్గాలు ల‌భించాయి. దాంతో ఓట‌ర్ల మ‌ద్ద‌తుతో సైకిల్ ప‌రుగులు పెట్టింది. క‌మ‌లం విక‌సించింది. గ్లాసు గ‌ల‌గ‌ల మంది. మొత్తం 175 సీట్ల‌లో 166 సీట్ల‌ను భాగ‌స్వామ్య ప‌క్షాలైన తెలుగుదేశం 137, జ‌న‌సేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజ‌యం సాధించాయి. మ‌రో ప‌క్క అధికార వైకాపా చావు దెబ్బ‌తింది. ఐదేళ్ల వైసిపి గాలి బుడగ ఒక్కసారిగా పేలిపోయింది. ఫ్యాను ముక్క‌లైంది. వైసీపీ క‌కావిక‌ల‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ఈ సారి కేవ‌లం 9 సీట్ల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. క‌నీసం ప్ర‌తిప‌క్ష‌హోదా కూడా లేదు. అలాగే అసెంబ్లీలో మూడు స్థానానికి దిగ‌జారింది. ఓట‌ర్లు ఏక‌ప‌క్షంగా త‌మ తీర్పు చెప్పారు. యుద్ధం కేవ‌లం ఒక వైపే జ‌రిగింది. దాంతో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తో బ‌రిలోకి దిగిన కూటమి ఎన్నిక‌ల రంగంలో సిక్స‌ర్ కొట్టింది. చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీ‌కాకుళం, విజయనగరం జిల్లాల‌ను కూటమి స్వీప్‌ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 137, 21 చోట్ల రంగంలోకి దిగిన జ‌న‌సేన మొత్తం 21లోనూ, ప‌ది స్థానాల్లో బ‌రిలోకి దిగిన బీజేపీ 8 చోట్ల విజయఢంకా మోగించాయి. అలాగే లోక్‌స‌భ ప‌రంగా… టీడీపీకి 16, జ‌న‌సేన‌కు 2, బీజేపీకి 3, వైసీపీకి 4 స్థానాలు ల‌భించాయి . సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి త‌ప్ప అంద‌రూ ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. పురుషులు, మహిళలు, కొత్త ఓటర్లు, నడివయస్కులు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు… ఇలా స‌మాజంలోని విభిన్న వ‌ర్గాలు కూట‌మికే త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు శాతం ఓట్లు అధికంగా పోల‌వ‌డంతో అది ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తే అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతూ వ‌చ్చారు. అది వాస్త‌వ రూపం దాల్చింది. భాగ‌స్వామ్య ప‌క్షాల న‌డుమ ఓట్ల బ‌దిలీ స‌క్ర‌మం జ‌రిగేలా తెలుగుదేశం, జ‌న‌స‌న‌, బీజేపీ నేత‌లు ఆది నుంచి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. అది బాగా క‌లిసొచ్చింద‌ని పేర్కొంటున్నారు. అలాగే చంద్ర‌బాబును అరెస్టు చేసి క‌నీసం బెయిల్ కూడా ల‌భించ‌నీయ‌కుండా అధికార పార్టీ అనుస‌రించి విధానాలు, ఆయ‌న‌ను 52 రోజుల పాటు జైలులో ఉంచడాన్ని ప్ర‌జాస్వామ్య‌వాదులు జీర్ణించుకోలేక‌పోయారు. దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ నేత‌లు పార్టీల‌క‌తీతంగా ఈ ఘ‌ట‌న‌ను ఖండించిన విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌న‌ర్హం. భూప‌రిర‌క్ష‌ణ చ‌ట్టం అమ‌లులోకి వ‌స్తే జ‌రిగే ప‌రిణామాల‌పై మేధావులు, ప్ర‌ముఖులు వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌ను కూట‌మి నేత‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. ఆ చ‌ట్టం వ‌స్తే త‌మ భూములకు ర‌క్ష‌ణ లేకుండా పోతుంద‌ని అన్ని వ‌ర్గాలు భావించాయి. ఇక ప్ర‌తి నెలా జీతాలు కావాల‌న్నా… సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు విడుద‌ల చేయాల‌న్నా రిజ‌ర్వు బ్యాంకు వ‌ద్ద బాండ్లు వేలం వేయ‌డం, అప్పులు చేయ‌డం అన‌వాయితీగా మారింది. ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాల‌ను ప్ర‌భుత్వం అణ‌గ‌దొక్కింది.జ‌గ‌న్ త‌న పాల‌న‌లో సంక్షేమానికి పెద్ద పీట వేసి అభివృద్ధిని పూర్తిగా విస్మ‌రించారు. గత ఐదేళ్లలో అభివృద్ధి కనిపించకపోవడంతో సామాన్య ఓటరు కూటమి వైపు మొగ్గుచూపార‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. అయిదేళ్ల పాటు రాష్ట్రానికి రాజ‌ధాని లేదు. మూడు రాజ‌ధానుల పేరిట వైసీపీ ఆడిన మూడు ముక్క‌లాట‌ను ఏపీ ప్ర‌జ‌లు తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రానికి న‌డుబొడ్డున ఉన్న అమ‌రావ‌తిని కాద‌న‌డాన్ని వారు అంగీక‌రించ‌లేదు. నీటి ప్రాజెక్టులు ప‌డ‌కేశాయి. కొత్త‌వి రాక‌పోగా ఉన్న ప‌రిశ్ర‌మ‌లు కూడా ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లి పోయాయి. ఉపాధి లేకుండా పోయింది. నిరుద్యోగుల్లో తీవ్ర ఆవేద‌న వ్య‌క్త‌మైంది. మ‌రో ప‌క్క కూట‌మికి కేంద్రం అండ‌దండ‌లు ల‌భించాయి. ప్ర‌చార స‌భ‌ల్లో మోదీ, అమిత్‌షాలు ఇటు ఏపీలో… అటు కేంద్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ప్రగ‌తి ప‌థంలో ప‌య‌నించ‌వ‌చ్చ‌ని చెప్పారు. అది ప్ర‌జల్లోకి బాగా వెళ్లింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. మోదీ గ్యారంటీపై కూడా న‌మ్మకం క‌లిగింది.

- Advertisement -

చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన తెలుగుదేశం

తెలుగుదేశం త‌న చ‌రిత్ర‌ను తానే తిర‌గ‌రాసింది. 93 శాతం స్ట్ర‌యిక్ రేట్ తో విజ‌య‌దుంధుభి మోగించింది. నాలుగో సారి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబునాయుడు గ‌ద్దెనెక్క‌నున్నారు. ఈ నెల 9న అమ‌రావ‌తిలో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండో పార్టీగా అవ‌త‌రించింది. పిఠాపురంలో ప‌వ‌న్ అర‌వై వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క స్థానంతో స‌రిపెట్టుకున్న జ‌న‌సేన ఈ సారి తాను పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజ‌య‌భేరి మోగించింది. 2014లో 102 స్థానాల్లో టీడీపీ, 67 స్థానాల్లో వైసీపీ గెల‌వ‌గా… అదే 2019లో కేవ‌లం 23 స్థానాల్లో టీడీపీ, 151 స్థానాల్లో వైసీపీ గెలిచాయి. ఆ చిత్రం 2024లో పూర్తిగా మారిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీ చేసిన కూట‌మి భాగ‌స్వామ్య పార్టీలు ఈ ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకొని వ‌డివ‌డిగా ముంద‌డుగు వేశాయి. సీట్ల పంపిణీలో స‌ర్దుబాటు ధోర‌ణిలో వెళ్లాయి. గెలిచే అభ్య‌ర్థుల‌నే రంగంలోకి దింపాయి.

విజ‌యానికి ఈ అంశాలు దోహ‌దం

తెలుగుదేశం కూటమి విజయానికి ప‌లు అంశాలు దోహ‌దం చేశాయి. ముఖ్యంగాఅధికారంలోకి వస్తే ఉద్యోగాల క‌ల్ప‌న ద‌స్త్రంపై తొలి సంతకం, భూ పరిరక్షణ చట్టం రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం బాగా క‌లిసొచ్చింది. అలాగే సూపర్ సిక్స్‌లో భాగంగా… ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంయువతకు 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు 23,000 నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000, ప్రతి రైతుకు ఏటా రూ. 20000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1500 సాయం వంటి హామీలు ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా కూట‌మి మ్యానిఫెస్టో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెలకు 4000 పింఛన్లు ఇస్తామని, ఏప్రిల్ మే జూన్ నెల‌ల బకాయిలు ఒకేసారి జులైలో చెల్లిస్తామని చంద్ర‌బాబు ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌క‌టించారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, దివ్యాంగులకు 6000 పింఛ‌ను ఇస్తామని చెప్పారు. 19-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఏడాదికి ఒక్కొక్కరికి రూపు 18,000 ఇస్తామని కూటమి చెప్పింది ప్రతి రైతుకు వేట 20,000 ఇస్తామని చెప్పింది చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించింది ఇంటి పన్నును సమీక్షిస్తామని విద్యుత్ చార్జీలు నియంత్రిస్తామ‌ని, సౌర విద్యుత్తు అనుసంధానం చేసి విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. యువతకు నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని, ఐదేళ్ల 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. ఉచిత ఇసుక విధాన అమలు చేస్తామని సామాన్యులకు ఇసుక అందేలా సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పింది ఎవరైనా సహజ మరణానికి రూ 5 లక్షలు ప్రమాద మరణాన్ని గ్రూపు 10 లక్షలు ఇస్తామని చెప్పింది ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య భీమా వర్తింప చేస్తామని, ఎయిడెడ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పింది. ప్రజా రాజధానిగా అమరావతి పుణ్య నిర్మాణం చేపడతామని తద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చేయూతనిస్తామని చెప్పింది. వాలంటీర్లకు నెల‌కు రూ. ప‌దివేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇవ‌న్నీ కూట‌మి విజ‌యానికి సోపానాలు అయ్యాయ‌ని ప‌రిశీల‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News