HomeTop StoriesZPTC MPTC Elections: ఏపీ పరిషత్ ఎన్నికల్లో రణరంగం.. పలుచోట్ల ఘర్షణలు..

ZPTC MPTC Elections: ఏపీ పరిషత్ ఎన్నికల్లో రణరంగం.. పలుచోట్ల ఘర్షణలు..

అమరావతి, నవంబర్ 5 (తెలుగుప్రభ): ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఏజెంట్లను అనుమతించే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. కడప, నంద్యాల, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

పార్నపల్లిలో ఎంపీ అవినాశ్‌రెడ్డి హల్‌చల్

పులివెందుల నియోజకవర్గంలోని పార్నపల్లిలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన అనుచరులతో కలిసి పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అక్కడ హల్‌చల్ చేశారు. ఏజెంట్లను ఎందుకు బయటకు పంపించారని పోలీసులను ప్రశ్నించారు. అనుమతి ఉన్న ఒక్కొక్కరినే లోపలికి పంపిస్తున్నామని పోలీసులు సమాధానమిచ్చారు. సున్నితమైన ప్రాంతం కావడంతో అవినాశ్‌రెడ్డిని పోలింగ్‌ కేంద్రం వైపు అనుమతించలేదు. దీంతో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇప్పట్ల, పార్నపల్లె, తుమ్మలపల్లె గ్రామాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గుండ్లకుంటలో ఉద్రిక్తతలు

కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పోలింగ్‌ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు బలవంతంగా బయటకు పంపించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు ఏజెంట్లను తిరిగి పోలింగ్‌ కేంద్రాల్లోకి పంపించారు. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గుండ్లకుంటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తమ్ముడి కుమారుడు శివారెడ్డి తమను బయటకు పంపించారని కూటమి ఏజెంట్లు ఆరోపించారు.

ఆర్.తుమ్మలపల్లిలో రాళ్లు, సోడా బాటిళ్లతో దాడులు

పులివెందుల సమీపంలోని ఆర్. తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వారు రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.

జూపాడుబంగ్లాలో వైసీపీ ఆందోళన

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలోని కేజీ రోడ్డుపై వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నేహా తండ్రిని పోలీసులు స్టేషన్‌కు తరలించడాన్ని నిరసించారు. టీడీపీ నాయకులు, పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

గురజాలలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ

పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. అనుమతి ఉన్నప్పటికీ లోపలికి ఎందుకు పంపించడం లేదంటూ పోలీసులను నిలదీశారు. అయితే, గుంపులుగా పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

వండుట్లలో వైసీపీ ఏజెంట్లపై దాడి

నంద్యాల జిల్లా గడివేముల మండలం వండుట్లలోనూ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఏజెంట్లపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పోలింగ్‌ కేంద్రాల నుంచి తమను బయటకు పంపించారంటూ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో వైసీపీ శ్రేణులు భారీగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News