AP’s Health Revolution: ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో నవశకం ప్రారంభమైంది! ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అత్యుత్తమ వైద్య నాలెడ్జ్‌ను రోగి ఇంటి వద్దకే చేరవేసే ‘సంజీవని ప్రాజెక్టు’ను అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఆవిష్కరించారు.
“సంపద, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా… మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అనారోగ్యమే నిజమైన పేదరికం” అని ఉద్వేగంగా పేర్కొన్న సీఎం, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసి, ఆన్‌లైన్‌లో భద్రపరుస్తామని తెలిపారు. ఈ చర్యతో వైద్య చికిత్సలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ఏపీ ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శంకర ఐ ఆసుపత్రి సేవలకు సీఎం ప్రశంసలు
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు శంకర ఐ ఆసుపత్రి చేస్తున్న కృషిని చంద్రబాబు అభినందించారు. ఈ ఫౌండేషన్ సేవలు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, నేపాల్, కాంబోడియా, నైజీరియా వంటి దేశాల్లోనూ విస్తరించాయని గుర్తుచేశారు.
కంచి పీఠం పిలుపు మేరకు అనేక మంది దాతలు స్పందించి ఈ మహత్తర సేవలకు చేయూతనిస్తున్నారని కొనియాడారు. శంకర ఐ ఫౌండేషన్ చేపట్టిన ‘రెయిన్‌బో’ కార్యక్రమం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయం అన్నారు. ఇప్పటివరకు 32 వేల వైద్య శిబిరాలు నిర్వహించి, దాదాపు 30 లక్షల మందికి కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా అందించడం, రోజుకు 750 మందికి ఆపరేషన్లు చేయడం అసాధారణమని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కంచి మఠం అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.


