పత్రికలకు సర్క్యులేషన్ ప్రాతిపాదికన కాకుండా, మండలానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నియోజకవర్గ అధ్యక్షుడు యం. సాల్ రంగడు జిల్లా నాయకులు ఇర్ఫాన్, కోశాధికారి మంజునాథ్ లు డిమాండ్ చేశారు. రాష్ట్ర-జిల్లా కమిటీ పిలుపు మేరకు స్థానిక ఆర్డిఓ మోహన్ దాసును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సాల్ రంగడు మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, అక్రిడేషన్ల కోసం ఇచ్చిన జీవో వల్ల జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారని, జర్నలిస్టులు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న అనేక సౌలభ్యాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ వైఖరి పట్ల వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. న్యూస్ పేపర్స్ కు సర్కులేషన్ నిబంధన పేరుతో కోత విధించకుండా మండలానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలని, చిన్న పత్రికలకు అక్రిడేషన్ సంఖ్యను పెంచాలని, పీడీఎఫ్ లకు గతంలో మాదిరి రెండు అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజన నేపథ్యంలో బస్సు పాసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా ఇవ్వాలన్నారు. జర్నలిస్టులు అందరికీ ఏసీ బస్సుల్లో కూడా పాసులు చెల్లేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికి 3 సెంట్ల ఇంటి స్థలం, ఇండ్లు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించాలని, రైల్వేలో రాయితీలను పునరుద్ధరించాలని, పక్క రాష్ట్రమైన తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు.
కరోనా వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో దశల వారిగ ఆందోళన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమయితే ఛలో విజయవాడ కార్యక్రమం కూడా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ గౌర సలహాదారుడు యం. నాగరాజు ఏపీయూడబ్ల్యుజే సీనియర్ నాయకులు చిన్న గిడ్డయ్య, పవన్, మధుబాబు. నియోజకవర్గ ఉపాధ్యక్షులు రంగన్న, సహకార దర్శి గడ్డం కుమారు, నియోజవర్గ ఆర్గనైజింగ్ నెంబర్ తాజు మహమ్మద్, మండల సహాయ కార్యదర్శి సఫి, గోపాలకృష్ణ, హరిబాబు. వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.