Andhra Pradesh: ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతంలో ఒక కీలకమైన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఇది రాబోయే 24 గంటల్లో బలపడి ‘అల్పపీడనంగా’ మారే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ తరువాతి 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత శక్తిని పుంజుకుని ‘వాయుగుండంగా’ మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సాధారణంగా వర్షాలను కురిపించే నైరుతి పవనాలు తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా తిరోగమనం చెందాయి. కానీ, ఉత్తర ఝార్ఖండ్ వద్ద మరో ఉపరితల ఆవర్తనం నెలకొనడం వల్ల వాతావరణంలో అనిశ్చితి కొనసాగుతోంది.
ఈ తాజా పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుని ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక బంగాళాఖాతంలో కూడా మరో అలజడి మొదలు కానుంది. ఈ నెల 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వరుస వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


