AP Assembly| ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో కూటమి నేతలే ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం విధానాలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు(Jyotula Nehru), డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(Raghu Rama Krishna Raju) మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఉచిత ఇసుక విధానంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నెహ్రు.. మరో అంశంపై మాట్లాడుతుండగా ఉప సభాపతి రఘురామ ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని కూర్చోమన్నారు.
దీంతో మనస్థాపానికి గురైన నెహ్రు.. కూర్చోమంటే కూర్చుంటానని తెలిపారు. అసెంబ్లీ రావొద్దంటే రానని తెలిపారు. కనీసం 5 నిమిషాలు కూడా మట్లాడనివ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. అయితే కూర్చోమని తాను అనడం లేదని ప్రసంగాన్ని త్వరగా ముగించాలని మాత్రమే అంటున్నానని రఘురామ సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిస్పందించిన జ్యోతుల నెహ్రు.. తనను ప్రతిపక్షంగా చూడకండి అని వెల్లడించారు. సార్… మీరు మాట్లాడడం మొదలుపెట్టి 12 నిమిషాలు అయ్యిందని.. అందుకే ఫినిష్ చేయమని అంటున్నాను అంతే అని RRR చెప్పుకొచ్చారు. దీంతో కాసేపు అసెంబ్లీలో సైలెన్స్ ఏర్పడింది.