శాసనమండలిలో(AP Council) అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu), మండలి విపక్షనేత బొత్స(Botsa) సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని.. గతంలో కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగనన్న కాలనీలు గురించి అయితే అసలు మాట్లాడాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. అచ్చెన్న మాటలను బొత్స తీవ్రంగా ఖండించారు. 2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదా అని బొత్స ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ‘2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు. కనీసం కట్టిన ఇళ్లకు ఒక్క పైసా ఇవ్వలేదు. జగనన్న కాలనీలు గురించి నేను మాట్లాడాల్సిన పనిలేదు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేంద్రం డబ్బులతోనే కథ నడిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి. గాలికి వచ్చిన నేతలు గాలికే పోతారు” అని వ్యాఖ్యానించారు.
బొత్స మాట్లాడుతూ… ‘2014-19 మధ్య ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. మా పార్టీ వారికే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత జగన్ ఎప్పుడూ చెప్పలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా..? కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా చంద్రబాబు సొంత ఆస్తా..? మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం. గాలికి వచ్చిన నేతను నేను కాదు. 1999లోనే పార్లమెంట్‌కు ఎన్నిక అయ్యాను’ అని మండిపడ్డారు.