Friday, December 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Sabarimala Yatra: ఇరుముడికి గగన యోగం: అయ్యప్ప స్వాములకు కేంద్రం తీపి కబురు!

Sabarimala Yatra: ఇరుముడికి గగన యోగం: అయ్యప్ప స్వాములకు కేంద్రం తీపి కబురు!

Irumudi cabin baggage allowance : స్వామియే శరణం అయ్యప్ప! అంటూ కఠోర దీక్షతో శబరిమల యాత్రకు సిద్ధమయ్యే కోట్లాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే స్వాములకు ఏళ్లుగా ఉన్న ఓ పెద్ద అసౌకర్యానికి తెరదించింది. దీక్షలో ప్రాణప్రదంగా భావించే పవిత్ర ‘ఇరుముడి’ని ఇకపై తమతో పాటే విమానం క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం లక్షలాది మంది భక్తుల మనోభావాలకు అద్దం పడుతోంది. 

- Advertisement -

శబరిమల యాత్రకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) చేతి సామాను (క్యాబిన్ బ్యాగేజ్)గా అనుమతిస్తూ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

భక్తుల మనోభావాలకు పెద్దపీట : ఇంతకాలం అమలులో ఉన్న కఠినమైన భద్రతా నియమావళి ప్రకారం, ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా ఇవ్వాల్సి వచ్చేది. అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడిని లగేజీలో పంపాల్సి రావడం భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని, మానసిక వేదనను కలిగిస్తోందని మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తించారు. ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన, భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) వంటి సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసి, అయ్యప్ప స్వాముల కోసం ఈ ప్రత్యేక మినహాయింపును అమలులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

క్యాబిన్‌లోకే పవిత్ర ఇరుముడి.. కానీ షరతులు వర్తిస్తాయి :
వెసులుబాటు కాలపరిమితి: ఈ ప్రత్యేక సడలింపు శుక్రవారం నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో వర్తిస్తుంది. శబరిమల మండల, మకరవిళక్కు యాత్రా సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును నిర్ణయించారు.

తనిఖీలు తప్పనిసరి: ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, విమానాశ్రయంలో భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకెళ్లవచ్చు. అయితే, ఇరుముడిని స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల సమయంలో భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని మంత్రి సూచించారు.

భక్తులకు విజ్ఞప్తి: శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా, అధికారుల సూచనలను కచ్చితంగా పాటిస్తూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామ్మోహన్ నాయుడు భక్తులను కోరారు.

దేశవ్యాప్త భక్తులకు ప్రయాణ సౌలభ్యం : అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, భక్తి, ఆచారాల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. దేశంలోని నలుమూలల నుంచి విమాన మార్గంలో శబరిమల చేరే భక్తులకు ఇది ఎంతో ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

శబరిమల యాత్రా కాలం : భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని ఈ నెల 15న తెరిచారు. 41 రోజుల పాటు సాగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. తిరిగి మకరవిళక్కు కోసం డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. యాత్ర ముగింపు సందర్భంగా జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News