హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడోసారి ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
చంద్రబాబుకు మోదీ, అమిత్‌షా అభినందనలు
అమరావతి, జూన్ 4 తెలుగు ప్రభ : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత ఫలితాలతో దూసుకుపోవడంపై అభినందనలు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 166 స్థానాల్లో దూసుకెళ్తోంది. మెజార్టీ జిల్లాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై మోదీ, అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో లోకేష్ విజయం
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయం సాధించారు. దాంతో తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయిన విషయం విదితమే. అయితే ఆత్మవిశ్వాసంతో మళ్ళీ బరిలోకి దిగిన ఆయనకు ఆ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. మంగళగిరిలో ఓటమి పాలయ్యారంటూ వైసీపీ నేతలు ఆయనను ఎన్నో విధాలుగా అవమానించారు. వాటన్నింటికీ నారా లోకేష్ తన విజయంతో సమాధానం చెప్పారు.
చంద్రబాబు ఇంటిలో సంబరాలు
ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో చంద్రబాబు ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. నారా చంద్రబాబు భువనేశ్వరీ దంపతులు హర్షం వ్యక్తంచేస్తూ.. కేక్ కట్ చేశారు. నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ కూడా కేక్ ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.