Sunday, December 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని అజ్ఞాత‌వాసం..!

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని అజ్ఞాత‌వాసం..!

  • పేరు కూడా విన‌ప‌డ‌ని మాజీమంత్రి
  • జ‌న‌సేన‌లో చేరికే అత్యంత సాధార‌ణం
  • మొన్న‌టివ‌ర‌కు ఒంగోలులో తిరుగులేని నాయ‌కుడు
  • అటు జ‌గ‌న్‌తో జ‌గ‌డం.. ఇటు జ‌న‌సేన‌లో నీర‌సం
  • ఐదేళ్ల పాటు రాజ‌కీయంగా అజ్ఞాత‌వాస‌మే
  • ఆ త‌ర్వాత కూడా అవ‌కాశాల‌పై అనుమానాలు

బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి(Balineni Srinivasa Reddy).. ఈ పేరు ఎక్క‌డో, ఎప్పుడో విన్న‌ట్లు అనిపిస్తోంది క‌దూ! అవును.. మాజీ మంత్రి, ఒక‌ప్పుడు ప్ర‌కాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో తిరుగులేని నాయ‌కుడు. వాస‌న్న అంటే చాలు.. ఎంత‌టి సామాన్యుడైనా వెళ్లి నేరుగా ఆయ‌న్ను క‌లిసే అవ‌కాశం ఉండేది. ఆయ‌న నోటి మాట వ‌చ్చిందంటే చాలు.. అధికార వ‌ర్గాలు కూడా ఉరుకులు ప‌రుగులు పెట్టి ప‌నులు చేసేవారు.

- Advertisement -

అదంతా గ‌తం..

ఇప్పుడు.. ఒక ర‌కంగా ఆయ‌న అజ్ఞాత‌వాసంలోకి వెళ్లిపోయిన‌ట్లు క‌నిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ(YSRCP) అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌(YS Jagan)తో చివ‌ర్లో కొంత జ‌గ‌డం అయ్యింది. మంత్రివ‌ర్గంలో త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని, పార్ల‌మెంటు స్థానానికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చిపెట్టార‌ని అలిగారు. చివ‌ర‌కు త‌న చిర‌కాల శ‌త్రువు దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న‌రావు(Damacharla Janardhan Rao) చేతిలో దాదాపు 34వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీకి రాజీనామా చేసేశారు.

ఒక విధంగా చెప్పాలంటే, అప్ప‌టి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేన(Janasena)లో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్ఠానం అందుకు అంగీక‌రించ‌లేదు. అనుచరులను కూడా వెంట తీసుకురాకూడ‌ద‌ని రూల్ పెట్టింది. ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్దుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకొన్నారు. తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ నిర్వహించేందుకు అధినేత అంగీకరించారని చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు నెలలు గడుస్తున్నా అలాంటి అనుమతి రాలేదు. అవకాశం లేదు. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కంకణం కట్టుకున్నానని చెబుతున్నా బాలినేని మాటను పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఖాతరు చేయడం లేదు.

ఇప్ప‌టికిప్పుడు త‌న‌కేదో ప‌ద‌వులు ఇచ్చేస్తార‌ని బాలినేని కూడా ఆశించ‌డం లేదు. ఒక‌వేళ అవ‌కాశం ఉంటే ఏమైనా శాస‌న‌మండ‌లి స‌భ్య‌త్వం ఇప్పిస్తారేమో అన్న ఆశ‌లు ఉండేవేమో. కానీ, తాజాగా నాగబాబు(Nagababu)కు రాజ్య‌స‌భ(Rajyasabha) స‌భ్య‌త్వం ఇప్పించ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. దాంతో బాలినేని ఆశలకు గండిపడింది. ఇప్ప‌ట్లో శాస‌న‌మండ‌లి స‌భ్య‌త్వం గురించి ఆశించ‌డానికి అవ‌కాశాలు లేవ‌న్న విష‌యం ఆయ‌న‌కు అర్థ‌మైపోయింది.

బాలినేని మండలిలో అడుగుపెట్టాలంటే ఇప్పుడు జనసేనకి మూడో ఎమ్మెల్సీ(MLC) సీటు రావాలి. ఆ స్థానానికి ఆయన పేరు పరిశీలించాలి. అది అంత సులువైన విషయం కాబోదు. ఎందుకంటే ఇప్పటికే జనసేన తర‌ఫున కాపు కులస్తుడు హరిప్రసాద్ తొలి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబును రెండో ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో తీసుకోవడం దాదాపు ఖాయ‌మైంది. మూడోసీటు కూడా ఓసీలకు కట్టబెట్టే అవకాశం అత్యల్పం. అసలు మూడో ఎమ్మెల్సీ జనసేనకు ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. వస్తే ఎవరికిస్తారో తెలీదు. అలాంటప్పుడు బాలినేని వరకూ ఛాన్స్ రావడం గగనమే.

ఇవన్నీ ఇప్పుడీ మాజీ మంత్రి ఆశల మీద నీళ్లు చ‌ల్లుతున్నాయి. ఓవైపు మిత్రపక్ష టీడీపీ నేతల నుంచి చీదరింపులు, రెండోవైపు తాను నమ్ముకున్న నాయకుడి నుంచి ఎదురుదెబ్బలతో బాలినేని లబోదిబోమనే పరిస్థితి వస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఆయన గతంలో ఎన్నడూ ఎదుర్కొని ఉండరనే మాట కూడా వినిపిస్తోంది.

అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో ఉండాల‌న్న కోరిక‌తో అదానీ-సెకి వ్య‌వ‌హారంలో అప్ప‌ట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని.. త‌న‌ను అర్ధ‌రాత్రి లేపి సంత‌కాలు చేయ‌మ‌న్నారంటూ ఓ సంచ‌ల‌నం రేపారు. అది నాలుగు రోజులు సోష‌ల్ మీడియాలోను, ప్ర‌ధాన‌స్ర‌వంతి మీడియాలో కూడా బాగానే తిరిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాలినేనిని ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన కూడా పోలేదు. దాంతో దాదాపు ఐదేళ్ల పాటు ఆయ‌న‌కు రాజ‌కీయంగా అజ్ఞాత‌వాసం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి. అప్పుడు కూడా మ‌ళ్లీ 2029 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న‌రావును కాద‌ని బాలినేనికి అవ‌కాశం క‌ల్పిస్తారా, లేదా..? అప్పుడు మ‌ళ్లీ ఒక‌వేళ వైఎస్సార్సీపీ పుంజుకుంటే అందులోకి వెళ్లి, అక్క‌డ ఎలాగోలా టికెట్ సాధిస్తారా అన్న‌ది చూడాలి.

నిజానికి గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లో చాలామంది నాయ‌కులు అధికార పార్టీ అండ‌దండ‌లు ఉండ‌డం త‌మ‌కు త‌ప్ప‌నిస‌రి అనుకుంటారు. అందుకే ప్ర‌భుత్వం మార‌గానే వెంట‌నే తాము కూడా పార్టీ మారిపోతారు. అక్క‌డ త‌మ‌కు ప‌ద‌వులు ఏమైనా ఉన్నా, లేక‌పోయినా పెద్ద‌గా ప‌ట్టింపు ఉండ‌దు గానీ, తాము కూడా అధికార‌పార్టీ మ‌నుషుల‌మే అనిపించుకోవ‌డం వారికి ముఖ్యం. అదంతా ఎందుకంటారా.. వాళ్ల వ్యాపార ప్ర‌యోజ‌నాల కోసం. స‌ర్వ‌సాధార‌ణంగానే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారిని వేధించాలంటే ప్ర‌ధానంగా వాళ్ల ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌కొడ‌తారు. అలా ఎక్క‌డ త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటాయోన‌న్న ఆందోళ‌న‌తోనే అధికార పార్టీలో ఉండేందుకు ఈ బ‌డా వ్యాపారులు క‌మ్ రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తుంటారు. అదేకోవ‌లోనే బాలినేని కూడా వెళ్లార‌ని అంటున్నారు. ఆయ‌న విల్లా ప్రాజెక్టుకు ఇబ్బందులు రాకుండా ఉండాల‌నే జ‌న‌సేన పంచ‌న చేరార‌ట‌!!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News