జనసేన పార్టీ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న నమ్మకాన్ని బలంగా వ్యక్తం చేశారు. “పిఠాపురం సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా జనసేనకే అంకితం” అని బాలినేని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయాలన్నది తన కల అని, ఆ విషయాన్ని గతంలో పవన్ కు చెప్పానని బాలినేని తెలిపారు. పవన్ కూడా సానుకూలంగా స్పందించి సినిమా చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ నిజమైన హీరో అని.. ఆయన వ్యక్తిగత ఎదుగుదల కోసం కాకుండా ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ప్రజాసేవ కోసం వస్తే వైసీపీ ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని బాలినేని ఆరోపించారు. తన తండ్రి ఆస్తిలో సగం అమ్మాల్సి వచ్చిందని.. వైసీపీ ప్రభుత్వం వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన భార్యకు సంబంధించిన ఆస్తులను కూడా జగన్ ప్రభుత్వం దోచుకుందని, జగన్ చేసిన అన్యాయాల గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదని అన్నారు.
రఘురామకృష్ణరాజు ఏదో అన్నారని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టి కొట్టించారని.. కానీ అవినీతి చేసి కోట్లు కూడబెట్టుకున్న వారిని వదిలేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. జగన్ పాలనలో నిజాయితీ, న్యాయం లేవని, చిన్న చిన్న కేసుల పేరుతో నిరపరాధులను అరెస్ట్ చేసి నిజమైన నేరస్థులను వదిలేస్తున్నారని విమర్శించారు. జగన్ చేసిన పాపాలకు ఒకరోజు ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ తన సొంత శక్తితో ఎదిగిన నాయకుడని, ఆయన రాజకీయం పదవుల కోసం కాదని, ప్రజల కోసమని బాలినేని అన్నారు. పవన్ లాంటి నాయకుడి వెంటే ఉండటం తనకు గర్వంగా ఉందని, న్యాయం, అభివృద్ధి, ప్రజాసేవ కోసం పని చేయాలంటే జనసేనకే భవిష్యత్తు ఉందని తెలిపారు.