కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలోని ప్రధాన ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం చంద్రబాబు(CM Chandrababu). భక్తులకు త్వరితగతిన దర్శనం, నాణ్యతగా ఉండే ప్రసాదం అందించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆలయాల్లో అన్యమత ప్రచారంపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే హిందూవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అన్యమత ఉద్యోగులను బదిలీ చేయడంతో అన్యమత ప్రచారం చిహ్నాలపై నిషేధం విధించారు. తాజాగా శ్రీశైలం(Srisailam) మహా క్షేత్రంలో ఇటువంటి నిబంధనలే తీసుకొచ్చారు.
శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమతచిహ్నాలు ప్రదర్శించడం పూర్తిగా నిషేధమని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అన్యమత సూక్తులు, చిహ్నాలను, భోదనలను, అన్యమతానికి సంబంధించిన ఫోటోలు కలిగిఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతించబడవని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని హెచ్చరించారు.