Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: 11 ఏళ్ల తరువాత భానుముక్కల పెద్దమ్మతల్లి జాతర

Banaganapalli: 11 ఏళ్ల తరువాత భానుముక్కల పెద్దమ్మతల్లి జాతర

బనగానపల్లె మండలం ఉమ్మడి బనగానపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని భానుముక్కల పెద్దమ్మ తల్లి జాతర వైభవంగా సాగింది. సుమారు 11సంవత్సరాల తర్వాత జాతర నిర్వహించడంతో భానుముక్కల గ్రామం బంధుమిత్రుల, స్నేహితుల రాకపోకలతో కిటకిటలాడింది. మంగళవారం రాత్రి కొండపేట శివాలయం వద్ద అమ్మవారి దేవతా విగ్రహాన్ని తయారు చేసి వివిధ పూజా క్రతువులు నిర్వహించి ఊరేగింపుగా తీసుకొని శ్రీ అచ్చమాంబమఠం వద్ద ఉన్న పెద్దమ్మ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఉంచారు. అనంతరం అసాదులు పెద్దమ్మ తల్లి జాతర జరుపుకునే వైనం గురించి కథ చెప్పిన తర్వాత అమ్మవారికి వివిధ పూజా క్రతువులను నిర్వహించి, అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు.

- Advertisement -

ప్రాణప్రతిష్ఠ అనంతరం అమ్మవారి విగ్రహానికి తెల్లవారుజాము నుంచే గ్రామ పరిధిలోని మహిళలు బోనాలను తలపై పెట్టుకుని మేళతాళాలతో అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీర్వాదాలు పొందేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కొండపేట ప్రాంతం భక్తజన సందోహంతో పోటెత్తింది. తిరిగి అమ్మవారికి 16 రోజుల పండుగ చేస్తామని రైతుసంఘం పెద్దలు తెలిపారు. పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా కొండపేటలో కొలువైన అమ్మవారిని బానుముక్కల రైతుసంఘం నాయకుల, గ్రామపెద్దల, బంధుమిత్రుల ఆహ్వానం మేరకు వివిధ పార్టీల నాయకులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News