అరటి చెట్ల పెంపకంలోనూ, అరటి కాయల ఉత్పత్తిలోనూ ఆంధ్ర ప్రధేశ్ క్రమంగా అగ్రస్థానానికి చేరుకుంటోంది. భారత దేశానికి సంబంధించి 2021లో ఆహారం, వ్యవసాయ అభివృద్ధి సంస్థ (ఎఫ్.ఏ.ఓ) వెలువరించిన నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మొత్తం అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 26.5 శాతం వరకూ ఉందని తెలిసింది. భారత దేశంలో కూడా అరటి కాయలు, పండ్ల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఏటా దాదాపు 54.84 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి ఇక్కడ జరుగుతోంది. అంటే, ఏటా దేశం మొత్తం మీద జరుగుతున్న ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ వాటా అత్యధికంగా 16.5 శాతం ఉంటోంది.
కేంద్రం చేపట్టిన సమీకృత తోటల అభివృద్ధి కార్యక్రమం కింద అరటి తోటల పెంపకాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, విస్తరించడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ విషయంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దీని కింద ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అరటి
తోటల పెంపకం విస్తారంగా చోటు చేసుకుంటోంది. ఈ కార్యక్రమం కిందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తోటల పెంపకానికి గాను హెక్టార్ కు మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ నిధులతో బిందు సేద్యాన్ని చేపట్టడానికి, అరటి మొలకలను పెంచడానికి అవకాశం కలుగుతుంది. అరటి తోటల ఖర్చులో 40 శాతం నిధులను కేంద్రమే కేటాయిస్తోంది. రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఈ వివరాలు అందించారు.