Tuesday, February 17, 2026
Homeఆంధ్రప్రదేశ్Hostels : బీసీ హాస్టళ్లలో 'డిజిటల్' వెలుగులు: రూ.15 కోట్లతో హైటెక్ హంగులు.. అసెంబ్లీ కమిటీ...

Hostels : బీసీ హాస్టళ్లలో ‘డిజిటల్’ వెలుగులు: రూ.15 కోట్లతో హైటెక్ హంగులు.. అసెంబ్లీ కమిటీ కీలక నిర్ణయాలు

BC Welfare Hostels Digitalization : ఒకప్పుడు ప్రభుత్వ వసతి గృహాలు అంటేనే అరకొర వసతులు, అలుముకున్న చీకట్లు అనే విమర్శలు ఉండేవి. కానీ, ఇక ఆ రోజులు పోయాయి! కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, ప్రైవేటు దీటుగా బీసీ సంక్షేమ వసతి గృహాలు (BC Hostels) రూపురేఖలు మార్చుకోబోతున్నాయి. నల్ల బల్ల స్థానంలో ‘డిజిటల్ స్క్రీన్’లు రాబోతున్నాయి. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 600 హాస్టళ్లను హైటెక్ హంగులతో తీర్చిదిద్దేందుకు అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ పచ్చజెండా ఊపింది. 

- Advertisement -

600 హాస్టళ్లు.. రూ.15 కోట్ల బడ్జెట్.. వచ్చే ఏడాదే టార్గెట్ : అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ బీద రవిచంద్ర అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన కీలక సమావేశంలో వసతి గృహాల ఆధునీకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయాలని నిర్ణయించారు.

నిధుల సమీకరణ: రాష్ట్రంలోని 600 బీసీ హాస్టళ్లలో డిజిటల్ తరగతుల నిర్వహణకు అవసరమైన పరికరాలు, కంటెంట్ కోసం దాదాపు రూ.15 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అంటే ఒక్కో హాస్టల్‌కు సుమారు రూ.2.50 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (Next Academic Year) ప్రారంభమయ్యే నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు కమిటీ అల్టిమేటం జారీ చేసింది. నిధుల సమీకరణ బాధ్యతను కమిటీయే స్వయంగా పర్యవేక్షించనుంది.

రీసోర్సు సెంటర్లు’గా హాస్టల్ గదులు, : కేవలం పరికరాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, బోధనా పద్ధతుల్లోనూ సమూల మార్పులు తీసుకురానున్నారు. ఎంపిక చేసిన హాస్టళ్లలో ఒక గదిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, అందులో ‘డిజిటల్ ఇంటరాక్టివ్ ప్యానెల్’ (Digital Interactive Panel) ఏర్పాటు చేస్తారు.

ప్రత్యేక ట్యూటర్లు: గణితం, సైన్స్, ఇంగ్లిష్, హిందీ వంటి క్లిష్టమైన సబ్జెక్టులపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ట్యూటర్లను నియమిస్తారు. వీరికి నెలకు రూ.15,000 వేతనంగా అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఈ రీసోర్సు సెంటర్లు వరంగా మారనున్నాయి.

మౌలిక వసతులపై ఆరా.. అధికారులకు వాతలు : ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేవని వస్తున్న ఫిర్యాదులపై కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సభ్యులు చదలవాడ అరవిందబాబు, కందికుంట వెంకటప్రసాద్, కాగిత ప్రసాద్‌లు అధికారులను నిలదీశారు.
తాగునీరు & విద్యుత్: స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్వో (RO) ప్లాంట్లు, విద్యుత్ కోతల నివారణకు ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే, హాస్టళ్ల వారీగా సమస్యల జాబితాను రూపొందించి, తక్షణమే పరిష్కరించాలని కమిటీ ఆదేశించింది.

ఆ రెండు జిల్లాలు ఓకే.. మిగతావి ఎప్పుడు : బీసీ భవనాల నిర్మాణం నత్తనడకన సాగడంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు కేవలం శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లోనే బీసీ భవనాలు పూర్తయ్యాయని, మిగిలిన 11 ఉమ్మడి జిల్లాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించింది. అలాగే, రెసిడెన్షియల్ పాఠశాలలకు డిమాండ్ పెరుగుతున్నందున, వాటి సంఖ్యను పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

రిజర్వేషన్లు పక్కాగా అమలు కావాల్సిందే” : విశ్వవిద్యాలయాలు, విద్యుత్ సంస్థల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని, ప్రతి నెలా ఒక జిల్లాలో పర్యటించి లోపాలను ప్రభుత్వం దృష్టికి తెస్తామని కమిటీ ఛైర్మన్ బీద రవిచంద్ర స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News