గుడిబండ (తెలుగు ప్రభ): గుడిబండ మండల పరిధిలోని భూతప్ప కనుమ అటవీ ప్రాంతంలో అడవుల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఫారెస్ట్ అధికారి విజయభాస్కర్ గురువారం సీడ్ బాల్స్ (విత్తన ఉండలు)ను అటవీలోని ఖాళీ ప్రదేశాల్లో చల్లారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ, సీడ్ బాల్స్‌లో వివిధ రకాల వృక్షాల విత్తనాలు ఉండటంతో వాటిని అడవిలోని ఖాళీ ప్రాంతాల్లో చల్లితే వర్షపు నీటి సహాయంతో మొలకెత్తి కొత్త మొక్కలుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. మొక్కలు సహజసిద్ధంగా పెరిగి భవిష్యత్తులో పెద్ద చెట్లుగా మారి అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.అడవులు పెరగడం వల్ల వర్షపాతం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, వన్యప్రాణులకు ఆవాసాలు లభిస్తాయని, జీవవైవిధ్యం పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని, అడవులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.ప్రకృతిని రక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును రక్షించినట్లేనని పేర్కొన్న విజయభాస్కర్, ప్రజలు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెట్ల నరికివేతను నిరోధించడంలో అటవీ శాఖకు సహకరించాలని కోరారు. సీడ్ బాల్స్ కార్యక్రమం ద్వారా భూతప్ప కనుమ అటవీ ప్రాంతంలో పచ్చదనం మరింత పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

