మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) కూటమి ప్రభుత్వంలో భారీ ఊరట లభించింది. ఆయన నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ చేయడగా ఈ అభియోగాల్లో వాస్తవం లేదని తేలింది. దీంతో ఆయనపై తదుపరి చర్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలు అన్నీ యథాతథంగా ఆయన పొందనున్నారు.
కాగా ఏబీపై వైసీపీ ప్రభుత్వం మొత్తం మూడు అభియోగాల్లో రెండు నిరూపితమైనట్లు పేర్కొని చర్యలకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసి ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలంటూ కోరింది. అయితే కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టు, క్యాట్‌లో న్యాయపోరాటం చేయడంతో పదవీ విరమణకు ఒక రోజు ముందు ప్రింటింగ్ స్టేషనరీ విభాగం డీజీగా నియమించిన విషయం విధితమే.