Andhra Pradesh News: అమాయకులను టార్గెట్ చేసుకొని కేటుగాళ్లు అనేక రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కేంద్రంగా ఓ సరికొత్త చీటింగ్ వెలుగులోకి వచ్చింది. సేమ్ టూ సేమ్ ‘కుబేర’ సినిమా మాదిరిగా ఈ స్కామ్ బయటపడింది. యాక్సిస్ బ్యాంక్ లో రూ.10.60 కోట్ల మేర కేటుగాళ్ళు దోపిడి చేశారు. అమాయక గిరిజనులకు ఎరవేసి రుణాలు ఇస్తామని నమ్మించి వాళ్లని ముంచేశారు. ఈ విధంగా 56 మంది పేరిట లోన్లు తీసి సైలెంట్‌గా డబ్బు నొక్కేశారు. అమాయకుల పేరిట ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాళ్ల పేర్లు మీద లోన్లు ఆప్లై చేసి సొమ్ము లూఠీ చేశారు.
కంపెనీలు ఏర్పాటు చేసి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతం చెల్లిస్తున్నట్లు స్టేట్మెంట్లు తయారు చేసింది ఈ దొంగల ముఠా. ఇలా చెల్లిస్తూనే గిరిజనుల పేరుతో యాక్సిస్ బ్యాంకులో లోన్సు తీసుకున్నారు. 2022 -2024 ఏళ్ల మధ్యలో ఈ స్కామ్ జరిగినట్లు బహిర్గతం అయ్యింది. ఈ క్రమంలో లోన్లు తిరిగి కట్టాలంటూ యాక్సిస్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. దీంతో గిరిజన యువకులు ఒక్కసారిగా షాకయ్యారు.
2024 ఏడాదిలో వాసుదేవ నాయుడు, శివ, అల్లాభక్షు, వెంకట్ అనే గిరిజన యువకులపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగులపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుటికే ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


