వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి(Chevireddy Bhaskar Reddy)హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేశారనే ఫిర్యాదుతో చెవిరెడ్డిపై తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బాలికకు వైద్యపరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు తెలిపినా దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు. అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురిచేశారంటూ బాలిక తండ్రి ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.