ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి చొరవను గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన ఒక లేఖ ద్వారా సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. గేట్స్ ఫౌండేషన్ బృందంతో ఏపీ ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. పేదలు, అట్టడుగువర్గాల కోసం తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలసి విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రోత్సాహం, ఏఐ ఆధారిత డిసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే వ్యవసాయ రంగంలో నాణ్యమైన విత్తనాల తయారీ, భూమి ఆరోగ్య నిర్వహణ, తల్లీబిడ్డల ఆరోగ్యానికి పోషకాల ప్రాధాన్యం వంటి అంశాలపై కూడా అభిప్రాయాల మార్పిడి జరిగిందని గేట్స్ తెలిపారు.
పాలనలో టెక్నాలజీ వినియోగానికి చంద్రబాబు చూపిన చొరవను గేట్స్ ప్రశంసించారు. ఆయన చూపిన విజన్, చిత్తశుద్ధి ప్రజల మేలు కోసం తన నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఏఐ ఆధారిత నిర్ణయాలు, రియల్ టైమ్ డేటా వ్యవస్థలు, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలలో చంద్రబాబు నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహకారం కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
బిల్ గేట్స్ తన తదుపరి భారత్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలనే ఆసక్తి వ్యక్తం చేశారు. భాగస్వామ్య లక్ష్యాలను చేరుకునే దిశగా గట్టి అడుగులు వేస్తామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ గేట్స్ ఫౌండేషన్ కలిసి పని చేస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను మెరుగుపరిచే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.