Bill Gates:ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అమరావతికి చేరుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ అయిన ఆయన రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధానిలోని సచివాలయం మొదటి బ్లాక్ వద్దకు చేరుకున్న గేట్స్ బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సచివాలయ పరిసరాల్లో ప్రత్యేక కదలికలు కనిపించాయి.
బిల్ గేట్స్‌కు పరిచయం..
స్వాగత కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సభ్యులను బిల్ గేట్స్‌కు పరిచయం చేశారు. తర్వాత వారు సమావేశ మందిరానికి వెళ్లి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై చర్చలు ప్రారంభించారు. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలన అమలు, గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న పథకాలు ప్రధాన చర్చా విషయాలుగా నిలిచాయి.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/jd-lakshminarayana-joins-ev-trans-as-vice-president/
నారా లోకేష్‌తో బిల్ గేట్స్…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్న ప్రాజెక్టులను మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరగనున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అదనపు మద్దతు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించనున్నారు.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని కూడా..
సచివాలయం సందర్శనలో భాగంగా బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని కూడా పరిశీలించనున్నారు. ప్రభుత్వ సేవలలో రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాలు ఎలా అమలవుతున్నాయో అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం ద్వారా వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి గేట్స్‌కు వివరించనున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై…
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో చేపట్టిన సంస్కరణలు, మెడ్ టెక్ మరియు డయాగ్నస్టిక్స్ సేవల విస్తరణపై వివరాలు వెల్లడించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-launches-jana-sena-membership-drive/
పర్యటనలో భాగంగా గేట్స్ బృందం అమరావతి సమీపంలోని ఉండవల్లి గ్రామం వద్ద ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనుంది. అక్కడ డ్రోన్లు మరియు కృత్రిమ మేధస్సు ఆధారంగా సాగు చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. తన ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులపై బిల్ గేట్స్ ఏమైనా ప్రకటన చేస్తారా అనే అంశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

