Sunday, November 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Mega Hero's: మెగా మద్దతు కోసం బీజేపీ వెంపర్లాట?!

Mega Hero’s: మెగా మద్దతు కోసం బీజేపీ వెంపర్లాట?!

Mega Hero’s: మెగా ఫ్యామిలీ మద్దతు కోసం కమలనాథులు తహతహలాడిపోతున్నారా? మొన్నామధ్యన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఆ వేదికపై చిరంజీవి పట్ల మోడీ కనబర్చిన శ్రద్ధ, అభిమానం స్పష్టంగా కనిపించింది.

- Advertisement -

ఇటీవలే.. ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించారు. ఆ సందర్భంగా జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకున్న ప్రధాని మోడీ అరగంటకు పైగా ఆయనతో చర్చలు జరిపారు. ఇక తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022 పురస్కారం దక్కిన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తారు. అంతకు ముందు చాలా నెలల క్రితం చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఢిల్లీలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

తెలంగాణలో అధికార పీఠంతో పాటు ఏపీలో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలనే వ్యూహంతో బీజేపీ రచించిన పెద్ద వ్యూహమే మెగా ఫ్యామిలీ పట్ల ఆ పార్టీ పెద్దలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు కారణమంటున్నారు పరిశీలకులు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన మెగాస్టార్ కుటుంబాన్ని ఇప్పుడు తన రాజకీయ వ్యూహానికి అనుగుణంగా వాడుకోవాలనేది కమలం నేతల ప్రణాళిక అని విశ్లేషిస్తున్నారు. అందుకే సందర్భం వచ్చినప్పుల్లా మెగా ఫ్యామిలీని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద స్థాయి నాయకులే ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. .

మెగాస్టార్ చిరంజీవికి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. ఆయన ఒక్క మాట చెబితే.. ఆయన అభిమాన దండు బీజేపీకి దన్నుగా నిలుస్తారన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అందుకే మెగా ఫ్యామిలీకి బీజేపీ అగ్రనేతలు ఈ స్థాయి ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషణలు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎటూ తమ మిత్రపక్షమే కాబట్టి.. పవర్ స్టార్ కు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో ఉన్న అభిమానులంతా కమలానికి కూడా సైనికుల్లాగే మారిపోతారన్నది వారి భావన అన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది.

అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను మరికాస్త దగ్గరకు చేసుకోవడానికే విశాఖలో ప్రధాని మోడీ టూర్ లో ఆయనకు దక్కినఅత్యంత ప్రాధాన్యం అని చెబుతున్నారు. ఎప్పుడో 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ కలిసి కనిపించారు. ఆ తర్వాత మిత్రపక్షం అధినేత అయినా అప్పటి నుంచి మళ్లీ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తో మోడీ భేటీ అయింది లేదు. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్న బీజేపీ మళ్లీ ఆయనను భుజాన మోసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేస్తానని గట్టిగా చెప్పిన పవన్ కళ్యాణ్ స్వరం మోడీతో భేటీ అయిన తర్వాత మారిన వైనాన్ని గమనిస్తే అది నిజమేననిపించక మానదు. అప్పటిదాకా టీడీపీ-బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. దీంతో బీజేపీతో కలిసి వెళ్లే మార్గంలో పవన్ నడుస్తున్నట్లు అంతా భావిస్తున్నారు.

ఇవన్నీ చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ మోదీ-షా జోడీ మెగాస్టార్ ఫ్యామిలీపై ఆధారపడిందనిపించక మానదు. 2014 ఎన్నికల్లో జనసేనాని తోడ్పాటు తీసుకోవడంతో మెగాస్టార్ ఫ్యామిలీకి దగ్గరవడం మొదలైన బీజేపీ ప్రయాణం చిరంజీవి కోడలు ఉపాసన మోడీతో భేటీ అయిన తర్వాత మరింత సన్నిహితం అయ్యింది. ఇటీవల చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో ‘రాజకీయాలకు నేను దూరమైనా.. రాజకీయాలు నాకు దూరం కావడం లేదు’ అనే డైలాగ్ ఈ నేపథ్యంలోనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

చిరంజీవి చదువుకున్న నర్సాపురంలోని వైఎన్ఎం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి నోట రాజకీయాలకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తగినవాడు, మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులతో కచ్చితంగా అత్యున్నత స్థానానికి చేరుకుంటాడు అనడం కూడా రాజకీయ సమీకరణాలలో మార్పునకు సంకేతంగానే భావించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News